యాపిల్ వ్యూహంలో మార్పులు.. భారత్‌కు పెద్ద పీట

  • సేల్స్, ప్రోడక్షన్ పరంగా యాపిల్‌ దృష్టిలో భారత్‌కు పెరిగిన ప్రాధాన్యం
  • ఈ మేరకు యాపిల్ యాజమాన్య విధానాల్లో మార్పులు
  • దేశంలో ఐఫోన్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు సంస్థ ప్రయత్నాలు 
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యాపిల్ తన దృష్టిని భారత్‌పై కేంద్రీకరించింది. ఆసియాలో యాపిల్‌కు ముఖ్యమైన మార్కెట్‌గా భారత్ అవతరిస్తున్న నేపథ్యంలో సంస్థ తన వ్యూహానికి మార్పులుచేర్పులు చేస్తోంది. సేల్స్ పరంగా భారత్‌ను ఓ ప్రత్యేక యూనిట్‌గా గుర్తిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా యాపిల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో భారత్‌కు ప్రాధాన్యం పెరిగిందన్న వ్యాఖ్యలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 

భారత్, మిడిల్ ఈస్ట్, తదితర దేశాల్లో యాపిల్ సేల్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న హ్యూగస్ ఆస్మెన్ ఇటీవలే రిటైర్ అయ్యారు. ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు యాపిల్ ఆశిష్ చౌదరిని ఎంపిక చేసింది. చౌదరి ప్రస్తుతం భారత్‌లో సేల్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. ఇకపై చౌదరి నేరుగా యాపిల్ సేల్స్ విభాగం అధిపతి మైఖేల్‌ ఫెంజర్‌కు అనుబంధంగా విధులు నిర్వర్తిస్తారు.

అమ్మకాల పరంగానే కాకుండా.. కొత్త ఉత్పత్తుల అభివృద్ధికీ భారత్‌ యాపిల్ సంస్థకు కీలకంగా మారింది. యాపిల్‌కు ముడి వస్తువులు సరఫరా చేసే అనేక సంస్థలు ఇప్పటికే భారత్‌వైపు దృష్టి సారించాయి. తన మాన్యుఫ్యాక్చరింగ్ భాగస్వామి అయిన హాన్ హాయి ప్రెసిషన్ ఇండస్ట్రీ భారత్‌లో ఓ ప్లాంట్‌ను నెలకొల్పేలా యాపిల్ ప్రయత్నాలు చేస్తోంది.


More Telugu News