రాత్రి వేళల్లో ఈ ఆహార పదార్థాలు వద్దు..!
- రాత్రుళ్లు మితాహారం, తేలికగా ఉండాలి
- ఘనాహారాలన్నీ పగటి పూటకే పరిమితం
- నిద్రకు ముందు వైన్, బీర్, స్వీట్స్ కు దూరంగా ఉండాలి
చాలా మంది రాత్రి వేళల్లో విందు భోజనాలు, పార్టీలు ఎక్కువగా చేసుకుంటుంటారు. కొవ్వు, మసాలా, కారం, తీపి పదార్థాలకు ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, రాత్రి వేళల్లో ఇలాంటి ఆహారాలతో మంచి కంటే చెడే ఎక్కువ. ఏ ఆహారం అయినా నచ్చినది మధ్యాహ్నం తినడం మేలు. రాత్రివేళకు వచ్చేసరికి మితాహారం, తేలికగా జీర్ణమయ్యేది తీసుకోవాలి.
- టమాటాలను రాత్రి వేళల్లో తినొద్దు. వీటిల్లో అసిడిక్ గుణం ఎక్కువగా ఉంటుంది. కనుక రాత్రి వేళల్లో దీన్ని తినడం వల్ల అసిడిటీకి దారితీస్తుంది.
- చాలా మంది రాత్రి వేళ ఐస్ క్రీమ్ తినేందుకు ఇష్టాన్ని చూపిస్తుంటారు. కానీ, రాత్రుళ్లు ఐస్ క్రీమ్ తినొద్దన్నది నిపుణుల సూచన. దీనివల్ల ఒత్తిడి కలిగించే కార్టిసోల్ హార్మోన్ విడుదల అవుతుంది. దీంతో ఆ రాత్రి నిద్ర గాఢంగా ఉండదు.
- రాత్రిపూట తీసుకోకూడని వాటిల్లో గ్రీన్ టీ కూడా ఒకటి. ఇందులో కెఫైన్ కు అదనంగా ఉండే ఉత్ప్రేరకాలు గుండె స్పందనల రేటును పెంచుతాయి. ఆందోళన, ఆదుర్దా పెరుగుతాయి. అందుకని గ్రీన్ టీని పగటి పూట, అది కూడా ఉదయం తాగడం వల్ల ఎక్కువ ఫలితాలు పొందొచ్చు.
- రాత్రి వేళల్లో చీజ్ తినడం వల్ల నిద్ర నాణ్యతపై ప్రభావం పడుతుంది. ఇది అప్రమత్తతను పెంచుతుంది. కనుక నిద్ర తొందరగా పట్టదు.
- ఆలూతో చేసే ఫ్రైస్ తెలుసుగా. వీటిని కూడా రాత్రి తినొద్దు. ఫ్రైస్ అరగడానికి మందం, గ్రీజీగా ఉంటాయి. కెచప్ అసిడిటీని పెంచుతుంది.
- రాత్రుళ్లే వైన్ తీసుకునే అలవాటు ఎక్కువ. కానీ, దీన్ని రాత్రి తాగడం వల్ల నిద్రలో ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్ (ఆర్ఈఎం) సైకిల్ సంపూర్ణంగా ఉండదు. అంటే నాణ్యమైన నిద్రను మిస్ అవుతారు.
- బీర్ కూడా అంతే, రాత్రి వేళ దీన్ని తాగడం వల్ల ప్రతి రెండు గంటలకోసారి మెలుకువ వస్తుంది.
- సిట్రస్ జాతి పండ్లు అయిన కమలా, నారింజ, ద్రాక్ష తదితర వాటిని రాత్రి తీసుకోవడం వల్ల గుండెలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎందుకంటే వీటిలో అసిడిక్ గుణాలు ఉంటాయి.
- ఉల్లిపాయ పొట్టలో యాసిడ్ రిఫ్లక్స్ కు కారణం అవుతుంది. చురుకుదనాన్ని పెంచుతుంది. కనుక రాత్రి వేళల్లో ఆనియన్స్ వద్దు.
- కాఫీ నిద్రా భంగం చేస్తుంది. కాఫీ తాగిన తర్వాత కెఫైన్ ప్రభావం 8-14 గంటల వరకు ఉంటుంది. కనుక కాఫీని ఉదయానికే పరిమితం చేయాలి.
- పంచదార ఎక్కువగా ఉండే పదార్థాలను, స్వీట్స్ ను రాత్రి పూట తీసుకోవద్దు. ఎందుకంటే దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ పరిమాణం హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అది నిద్రపై ప్రభావం చూపిస్తుంది.
- మసాలా, కారంతో కూడిన స్పైసీ ఫుడ్స్ ను రాత్రి వేళ తినొద్దు. జీవక్రియల్లో వేగం పెరిగి నిద్రకు విఘాతం ఏర్పడుతుంది.
- రాత్రి భోజనం తర్వాత తీపి కోసం చాక్లెట్లు తినేవారు ఉన్నారు. చాక్లెట్లలో కొంత కెఫైన్ కూడా ఉంటుంది. దాంతో నిద్రకు ఇబ్బంది ఏర్పడొచ్చు.
- అధిక ప్రొటీన్ ఉన్న ఆహారంతో ట్రిప్టోఫాన్ తక్కువగా విడుదల అవుతుంది. దీనివల్ల సెరటోనిన్ స్థాయి తగ్గుతుంది. అది నిద్రపై ప్రభావం చూపిస్తుంది.
- ఇక డ్రైఫ్రూట్స్ ను కూడా రాత్రివేళ్లలో తినొద్దు. ఒకవేళ తిన్నా చాలా కొద్ది పరిమాణానికే పరిమితం కావాలి.
- పిజ్జా తినడం వల్ల పొట్టలో యాసిడ్ పెరుగుతుంది. దీనివల్ల రాత్రి నిద్రకు ఇబ్బంది ఏర్పడుతుంది.
- పగలు నీటిని ఎక్కువగా తీసుకుని, రాత్రి వేళల్లో తగ్గించుకోవాలి.