ఈశాన్య రాష్ట్రం యువకుడికి బెంగళూరులో వేధింపులు

  • బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న యువకుడు
  • యువకుడి హెల్మెట్ నేలకేసి కొట్టిన ఆటోడ్రైవర్
  • వేరే దేశం నుంచి వచ్చి కింగ్‌లా బతికేస్తున్నాడంటూ ఆగ్రహం
  • తమ పొట్టకొడుతున్నాడని ఆటో డ్రైవర్ ఆరోపణ
ఈశాన్య భారత్‌కు చెందిన ఓ యువకుడు బెంగళూరులో వేధింపుల బారిన పడ్డాడు. బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా బతుకు వెళ్లదీస్తున్న అతడిని స్థానిక ఆటోడ్రైవర్ అడ్డుకుని వేధింపులకు గురి చేశాడు. అతడి హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు. స్థానిక ఆటోడ్రైవర్ల పొట్టకొడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘‘ఫ్రెండ్స్.. చూడండి..బైక్ ట్యాక్సీల అక్రమ దందా ఎలా నడుస్తోందో. వేరే దేశం నుంచి ఇక్కడికొచ్చిన ఇతడు ఇక్కడ రాజాలాగా తిరిగేస్తున్నాడు. ఆటో రంగానికి ఇలాంటి వాళ్ల వల్ల ప్రమాదం’’ అని ఆ ఆటోడ్రైవర్ వ్యాఖ్యానించడం వైరల్‌గా మారింది. 

సోమవారం ఇందిరా నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. అక్కడే ఉన్న ఒకరు ఈ మొత్తం ఉదంతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఘటన క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆటో డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ‘‘ఈ ఘటనపై ఇందిరా నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని బెంగళూరు పోలీసులు ట్విట్టర్‌లో వెల్లడించారు. తమిళనాడులోనూ ఉత్తరాది వలసకార్మికులపై దాడులు జరిగాయన్న వీడియోలు ఇటీవల వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.


More Telugu News