లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వారంతా కవిత పేరే ఎందుకు చెపుతున్నారు?: డీకే అరుణ

  • కవితకు నోటీసులు ఇవ్వడం వెనుక బీజేపీ కక్ష సాధింపులు లేవన్న అరుణ
  • ఆపద వచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుంటారని విమర్శ
  • మహిళా రిజర్వేషన్లు అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారని మండిపాటు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బీజేపీ నాయకురాలు డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కక్ష సాధింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని అన్నారు. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం వెనుక కక్ష సాధింపులు లేవని చెప్పారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని... అధికారంలోకి వచ్చిన వెంటనే అందరిపై కక్ష సాధింపులకు దిగిన కల్వకుంట్ల కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి అందరూ అలాగే చేస్తున్నట్టు అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. 

లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే అరెస్ట్ అయిన వారు పదేపదే కవిత పేరును ఎందుకు చెపుతున్నారని అరుణ ప్రశ్నించారు. ఈడీ విచారణలో కవిత ఆమె నిజాయతీని నిరూపించుకోవచ్చని చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి ఆపద వచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడం అలవాటని విమర్శించారు. లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ విచారణకు పిలిస్తే... మొత్తం తెలంగాణ సమాజాన్నే అవమానిస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈడీ నుంచి నోటీసులు వస్తాయని ముందస్తు సమాచారం ఉండటం వల్లే... మహిళా రిజర్వేషన్లు అంటే కొత్త డ్రామాకు తెరతీశారని అనిపిస్తోందని చెప్పారు. ఈ నెల 11న ఈడీ విచారణకు కవిత హాజరుకానున్న సంగతి తెలిసిందే.


More Telugu News