గుజరాత్ ఐఏఎస్‌ అధికారిపై దాడి.. డ్యామ్‌లోకి విసిరేస్తామంటూ వార్నింగ్

  • గుజరాత్‌లోని సబర్‌ఖంతా జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • చేపల పెంపకం ప్రాజెక్టులో అవకతవకలు బయటపడడంతో దాడి
  • పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
తనిఖీలకు వచ్చిన ఓ ఐఏఎస్‌ అధికారిని నిర్బంధించి దాడి చేసిన ఘటన గుజరాత్‌లో తాజాగా వెలుగు చూసింది. సబర్‌ఖంతా జిల్లాలోని ఓ గ్రామంలో చేపల పెంపకం ప్రాజెక్టును తనిఖీ చేసేందుకు వెళ్లిన ఐఏఎస్ నితిన్ సంగ్వాన్‌పై కొందరు కాంట్రాక్టర్లు దాడి చేశారు. తాము అవకతవకలకు పాల్పడ్డామని ఐఏఎస్ అధికారి గుర్తించడంతో నిందితులు ఈ దాడికి తెగబడినట్టు తెలిసింది. 

మత్స్య శాఖ డైరెక్టరైన సంగ్వాన్ సోమవారం అంబావాడా గ్రామంలోని చేపల పెంపకం ప్రాజెక్టును తనిఖీ చేసేందుకు వెళ్లారు. స్థానికంగా ఉన్న కొందరు కాంట్రాక్టర్లు ఈ ప్రాజెక్టును దక్కించుకున్నారు. ధరోయ్ డ్యామ్ నీళ్లలో కేజ్ కల్చర్ ఫిషింగ్ ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. కాంట్రాక్టు దక్కించుకున్న వారికి ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తోంది.

అయితే.. ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్టు సంగ్వాన్ గుర్తించినట్టు కాంట్రాక్టర్లకు అనుమానం రాగానే వారు ఆయనతో వాగ్వాదానికి దిగారు. కాంతపురా గ్రామానికి చెందిన బాబు పార్మర్ అనే వ్యక్తి ఆయన మోకాళ్లపై కొరికాడు. ఆ తరువాత మరో నలుగురు ఘటనాస్థలానికి చేరుకుని ఐఏఎస్‌పై దాడికి దిగారు. సంగ్వాన్‌తో పాటూ ఆయన వెంట ఉన్న ఇతర అధికారులను డ్యామ్‌లో పారేస్తామని కూడా వారు బెదిరించారు. ఈ మేరకు ఐఏఎస్ వెంట వచ్చిన పటేల్ అనే అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు పది పదకొండు మంది తమను చుట్టుముట్టారని, పోలీసులకు ఫిర్యాదు చేయకూడదంటూ ఓ కాగితంపై తమతో సంతకం చేయించుకున్నారని కూడా ఆరోపించారు. 

కాగా.. ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడైన బాబు పర్మార్‌తో పాటూ మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టుబడ్డ నిందితులు బానస్‌కాంతా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

Guj

More Telugu News