బాలీవుడ్ నటుడు సతీష్ కౌశిక్ మృతి.. ప్రముఖుల సంతాపం

  • ఢిల్లీలో కారులో వెళుతున్న సమయంలో గుండెపోటు
  • ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణాలు 
  • నేడు ముంబైలో అంత్యక్రియలు
  • ఆయన నటించిన చివరి సినిమా ఛత్రివాలి
బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ (66) బుధవారం అర్ధరాత్రి తర్వాత ప్రాణం విడిచారు. ఢిల్లీలో కారులో వెళుతున్న సమయంలో హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన్ను వెంటనే గురుగ్రామ్ లోని ఫోర్టిస్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వైద్యులు ప్రయత్నించినప్పటికీ ప్రాణాలను కాపాడలేకపోయారు. కౌశిక్ మరణం బాలీవుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. మనోజ్ బాజ్ పాయి, సుభాష్ ఘయ్, అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్, అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్, మాధుర్ బండార్కర్ సహా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

సతీష్ కౌశిక్ మృత దేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మధ్యాహ్నానికి ముంబైకి భౌతిక కాయాన్ని తరలించనున్నారు. ఆ వెంటనే అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం. 

నటుడు, హాస్య నటుడు, స్క్రీన్ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్.. ఇలా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన ప్రతిభావంతుడు సతీష్ కౌశిక్. 1956 ఏప్రిల్ 13న హర్యానా రాష్ట్రంలో జన్మించారు. ఆయనకు భార్య శశి, కుమార్తె వన్షిక కౌశిక్ (11) ఉన్నారు. 

1987లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ మిస్టర్ ఇండియలో ‘కేలండర్ ఖానా దో’ అనే డైలాగ్ తో కౌశిక్ బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకంటూ ప్రత్యేక అభిమాన గణం ఏర్పడింది. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి నటించడం కౌశిక్ ప్రత్యేకత. రామ్ లఖన్ సినిమాలో పోషించిన పాత్రకు గాను ఉత్తమ హాస్య నటుడిగా మొదటిసారి ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. సాజన్ చలే ససురల్ (1996), మిస్టర్ అండ్ మిస్టర్స్ ఖిలాడీ (1997), దివానా మస్తానా (1997), కల్ కత్తా మెయిల్ (2003) ఇలా ఎన్నో చిత్రాల్లో నటించారు. రకుల్ ప్రీత్ కథానాయికగా నటించిగా ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఛత్రివాలి సినిమా సతీష్ కౌశిక్ కెరీర్ లో చివరిది.


More Telugu News