గగనతలంలో రెండు శిక్షణ విమానాల ఢీ... పైలట్ల మృతి

  • ఇటలీలోని రోమ్ శివార్లలో విన్యాసాలు చేస్తున్న విమానాలు
  • పరస్పరం ఢీకొని నేలకూలిన వైనం
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ
ఇటలీ వాయుసేనకు చెందిన రెండు శిక్షణ విమానాలు గగనతలంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు విమానాల పైలట్లు మృత్యువాతపడ్డారు. తేలికపాటి యుద్ధ విమానాలతో రోజువారీ విన్యాసాలు చేస్తుండగా, పొరబాటున రెండు విమానాలు ఒకదానిని ఒకటి ఢీకొని నేలకూలాయి. వీటిలో ఒకటి పొలంలో కూలిపోగా, మరొకటి పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. 

ఇవి రెండు యూ-208 రకం విమానాలు. ఇటలీ రాజధాని రోమ్ శివార్లలోని గిల్డోనియా మిలిటరీ ఎయిర్ పోర్టు సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

ఈ ప్రమాదం పట్ల ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన పైలట్ల కుటుంబాలకు, వారి సహచరులకు సంతాపం తెలియజేశారు. యూ-208 విమానం సింగిల్ ఇంజిన్ ట్రైనింగ్ విమానం. దీంట్లో పైలట్ సహా ఐదుగురు ప్రయాణించవచ్చు. ఇది గరిష్ఠంగా గంటకు 285 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.


More Telugu News