మధ్యప్రదేశ్ లో హనుమంతుడి కటౌట్ ముందు మహిళల బాడీ బిల్డర్ల పోజులు.. కాంగ్రెస్, బీజేపీ మధ్య రచ్చ

  • మధ్యప్రదేశ్ లో బీజేపీ నేతల ఆధ్వర్యంలో పోటీలు
  • హనుమంతుడిని అగౌరవ పరిచారంటూ కాంగ్రెస్ ఆరోపణ
  • మహిళలు క్రీడల్లో రాణించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదంటూ బీజేపీ ఎదురుదాడి
మధ్యప్రదేశ్ లో బాడీ బిల్డింగ్ పోటీ రాజకీయ కుస్తీ పోటీగా మారింది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీలపై కాంగ్రెస్, బీజేపీ స్థానిక నేతలు వాగ్వాదానికి దిగారు. 13వ మిస్టర్ జూనియర్ బాడీబిల్డింగ్ పోటీలు ఈ నెల 4, 5వ తేదీల్లో జరిగాయి. ఇందులో మహిళా బాడీబిల్డర్లు స్టేజీపై హనుమంతుడి కటౌట్ ముందు పోజులివ్వడం వివాదానికి కారణమైంది. 

పోటీ ముగిసిన వెంటనే పలువురు స్థానిక కాంగ్రెస్ నాయకులు స్టేజ్ పై గంగా జలం చల్లారు. హనుమాన్ చాలీసా చదివారు. బీజేపీ మేయర్ ప్రహ్లాద్ పటేల్‌తో కూడిన కమిటీ బాడీబిల్డింగ్ పోటీని నిర్వహించగా, బీజేపీ ఎమ్మెల్యే చైతన్య కశ్యప్ కమిటీకి ప్యాట్రన్ గా ఉన్నారు. ఈ ఈవెంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

బీజేపీ నేతలు అసభ్యతను ప్రదర్శించేలా కార్యక్రమం చేపట్టారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని హనుమంతుడు శిక్షిస్తాడని అన్నారు. మరోవైపు మహిళలు క్రీడల్లో రాణించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి హితేష్ బాజ్‌పాయ్ ఎదురు దాడికి దిగారు. కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కార్యక్రమ నిర్వాహకులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం హిందువులను, హనుమంతుడిని అగౌరవపరిచిందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధినేత కమల్ నాథ్ మీడియా సలహాదారు పీయూష్ బాబెలే ఆరోపించారు. దీనికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


More Telugu News