నారా లోకేశ్ పాదయాత్రలో వంగవీటి రాధా!

  • పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న ‘యువగళం’ పాదయాత్ర
  • సంఘీభావంగా యాత్రలో పాల్గొన్న వంగవీటి రాధా
  • లోకేశ్ తో కలిసి నడిచిన మాజీ ఎమ్మెల్యే
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం నుంచి 37వ రోజు యాత్రను లోకేశ్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాదయాత్రలో విజయవాడ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పాల్గొన్నారు. యాత్రకు సంఘీభావం తెలిపిన రాధా.. లోకేశ్ తో పాటు పాదయాత్ర చేశారు. వారిద్దరూ నడుస్తూ పలు విషయాలపై చర్చించుకోవడం కనిపించింది. 

వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నప్పటికీ.. ఆ పార్టీని వీడతారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. జనసేనలో చేరుతున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇప్పుడు లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ.. ఆయన పాల్గొనడం చర్చనీయాంశమవుతోంది.

ఈ రోజు పాదయాత్ర ప్రారంభానికి ముందు కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం దగ్గర ముస్లిం ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం ఏనాడూ మైనార్టీ సోదరులపై దాడులు జరగలేదన్నారు. మైనార్టీల్లో పేదరికం ఉండకూడదనే లక్ష్యంతో టీడీపీ మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మైనార్టీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని చెప్పి జగన్ మోసం చేశారని విరుచుకుపడ్డారు. ఉప మఖ్యమంత్రిగా అంజాద్ బాషా ఉండి కూడా మైనార్టీలకు న్యాయం జరగలేదన్నారు.


More Telugu News