విధుల్లో ఒకేఒక ఇంజినీర్ మిగలడంతో ట్విట్టర్ క్రాష్

  • ఏపీఐ వ్యవహారాలు చూసేందుకు ట్విట్టర్‌లో ఒకేఒక ఇంజినీర్
  • కోడ్‌లో తప్పుడు మార్పుల కారణంగా కాసేపు స్తంభించిపోయిన ట్విట్టర్
  • ఇతర విభాగాల సిబ్బంది కల్పించుకోవడంతో సమస్యకు పరిష్కారం
సోమవారం రాత్రి ట్విట్టర్ అకస్మాత్తుగా కొన్ని గంటల పాటు నిలిచిపోయింది. ట్విట్టర్‌లో లింక్స్ పనిచేయక కొందరు ఇబ్బంది పడితే.. మరికొందరికి తమ ఫీడ్‌లో ఇతరుల ట్వీట్స్‌ కనబడలేదు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈలోపు ట్విట్టర్ సిబ్బంది రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ట్విట్టర్ ఏపీఐ‌లో తప్పుడు మార్పులతో ఈ పరిస్థితి తలెత్తినట్టు ప్లాట్‌ఫార్మర్ అనే టెక్ రంగ విశ్లేషణ సంస్థ తాజాగా వెల్లడించింది. ఆ సమయంలో విధుల్లో ఒక్కరే ఇంజినీర్ ఉన్నారని, ఆయన చేసిన పొరపాటు ఫలితంగానే ట్విట్టర్ కొన్ని గంటలపాటు స్తంభించిపోయిందని పేర్కొంది. 

ఏపీఐ మార్పులతో ట్విట్టర్ స్తంభించిపోవడమే కాకుండా అంతర్గత వ్యవస్థల్లోనూ సమస్యలు తలెత్తినట్టు సమాచారం. దీంతో ఇతర విభాగాల్లోని ఇంజినీర్లు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారట. ఘటనపై ఎలాన్ మస్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కాగా ఈ విషయమై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపీఐ కోడ్ మొత్తం టచ్ చేస్తే కుప్పకూలేలా తయారైందని వ్యాఖ్యానించారు. కోడ్ మొత్తాన్ని మార్చాల్సి వస్తుందేమోనని కూడా అనుమానం వ్యక్తం చేశారు. 

ఖర్చుల తగ్గింపు పేరిట మస్క్ ట్విట్టర్‌లో ఉద్యోగుల తొలగింపునకు దిగాక సాంకేతిక సమస్యలు పెరిగాయని పరిశీలకులు చెబుతున్నారు. ట్విట్టర్ ఉద్యోగులు కూడా ఈ విషయన్ని సీరియస్‌గా తీసుకోవడం మానేశారని సమాచారం.


More Telugu News