విమానంలో ప్రయాణికుడి రచ్చ.. విరిగిన స్పూన్‌తో సిబ్బందిపై దాడి

  • యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఘటన
  • ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించిన ప్రయాణికుడు
  • విరిగిన చెంచాతో సిబ్బందిపై దాడి
  • విమానం లాండవగానే అరెస్ట్ 
ఇటీవల ఓ అమెరికా విమానంలో ప్రయాణికుడు రచ్చ రచ్చ చేశాడు. గాల్లో ఎగురుతున్న విమానంలో ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించడమే కాకుండా సిబ్బందిపై దాడికి దిగాడు. దీంతో.. విమానసిబ్బంది అతడిని ఇతర ప్రయాణికుల సాయంతో అదుపు చేశారు. విమానం లాండయ్యాక పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

లాస్ ఏంజిలిస్ నుంచి బోస్టన్ వెళుతున్న యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత..ఎవరో ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించినట్టు ఫ్లైట్ సిబ్బందికి అలర్ట్ వెళ్లింది. అక్కడికెళ్లి చూడగా తలుపు హ్యాండిల్ కొంత మేర పక్కకి జరిగి ఉండటం కనిపించింది. దీంతో సిబ్బంది హ్యాండిల్‌ను యథాస్థానానికి చేర్చి విషయాన్ని పైలట్‌కు తెలిపారు. ఈ క్రమంలో టోరెస్ అనే ప్రయాణికుడు తలుపు తెరిచేందుకు ప్రయత్నించడం తాను చూశానని సిబ్బందిలో ఒకరు పేర్కొన్నారు. దీంతో..వారు టోరెస్‌ను ప్రశ్నించారు. అయితే.. తాను డోర్ తెరుస్తున్నట్టు కెమెరాల్లో రికార్డైతే చూపించండంటూ టోరెస్ ఎదురు ప్రశ్నించాడు. ఈ క్రమంలో కొందరు సిబ్బంది టోరెస్‌తో ప్రమాదం ఉందన్న అనుమానాన్ని పైలట్ వద్ద వ్యక్తం చేశారు. 

ఈలోపు..టోరెస్ మరోసారి ఎమర్జెన్సీ డోర్ వైపు కదిలాడు. తలుపునకు ఎదురుగా నిలబడ్డ ఇద్దరు సిబ్బందిలో ఒకరిపై విరిగిన స్పూన్‌తో దాడి చేశాడు. ఆమె మెడపై మూడు సార్లు పొడిచాడు. దీంతో అప్రమత్తమైన తోటి ప్రయాణికులు, సిబ్బంది అతడిని అదుపు చేసి సీటుకు కట్టేసి కూర్చోబెట్టారు. అనంతరం విమానం బోస్టన్‌లో లాండవగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో టోరెస్‌కు ఐదేళ్ల నుంచి గరిష్ఠంగా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

USA

More Telugu News