నార్సింగి శ్రీచైతన్య కాలేజీపై నిషేధం
- విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటన నేపథ్యంలో ఇంటర్ బోర్డు చర్యలు
- వచ్చే ఏడాది నుంచి కాలేజీపై నిషేధం
- ఫస్టియర్ అడ్మిషన్లు చేపట్టకూడదని ఆదేశాలు
హైదరాబాద్ నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సాత్విక్ 6 రోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాత్విక్ సూసైడ్ నోట్ ఆధారంగా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు నార్సింగి కాలేజీపై ఇంటర్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఫస్టియర్ అడ్మిషన్లు చేపట్టకుండా నిషేధం చేపట్టింది. కాలేజీల నిర్వహణను ప్రిన్సిపాల్స్, లెక్చరర్ల మీద వదిలేసి... ఏదైనా జరిగిన తర్వాత తమకేం సంబంధం లేదని యాజమాన్యాలు చెపితే కుదరదని, క్రిమినల్ కేసులు ఉంటాయని ఇంటర్ బోర్డు హెచ్చరించింది.