'రౌడీ అల్లుడు' విషయంలో అలా జరిగింది: సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్!

  • మ్యూజికల్ హిట్ గా నిలిచిన 'రౌడీ అల్లుడు'
  • ఆ పాట రాఘవేంద్రరావుకు నచ్చలేదన్న వాసూరావు
  • తాను ట్యూన్ చేసిన పాట పాప్యులర్ అయిందని వెల్లడి 
  • చిరూ ఆఫర్ వదులుకోవలసి వచ్చిందని వివరణ
సాలూరి వాసూరావుకి సంగీత దర్శకుడిగా మంచి పేరు ఉంది. చాలా సినిమాలకి .. సీరియల్స్ కి ఆయన సంగీత దర్శకుడిగా పనిచేశారు. తాజాగా 'తెలుగు వన్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'గ్యాంగ్ లీడర్' సినిమాలోని పాటలు హిట్ అయ్యాయి. అందువలన 'రౌడీ అల్లుడు' సినిమాలోని పాటలను కూడా బప్పీలహరి'కే ఇచ్చారు" అన్నారు. 

'రౌడీ అల్లుడు' సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నేను చేశాను. అయితే బప్పీలహరి చేసిన 'చిలుకా క్షేమమా' పాట ట్యూన్ కూడా రాఘవేంద్రరావు గారికి నచ్చలేదు. ఆ పాట చాలా స్పీడ్ గా ఉందంటూ రాఘవేంద్రరావుగారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాంతో నేను ఆ పాటను ట్యూన్ చేశాను. అది ఆయనకి బాగా నచ్చింది. ఆ పాట ఎంత పాప్యులర్ అయిందనేది అందరికీ తెలిసిందే.

"ఆ సినిమా విషయంలో చిరంజీవిగారు నన్ను ఎంతో మెచ్చుకున్నారు .. నాతో కలిసి పనిచేయాలని ఉందని అన్నారు. అన్నట్టుగానే ఓ సినిమాకి పనిచేయమని అల్లు అరవింద్ గారు అడిగారు. అయితే అప్పుడు నేను బాలూ గారితో కలిసి అమెరికా వెళ్లవలసి ఉంది. ఆయనకి మాట ఇచ్చాను గనుక, ఆ సినిమా చేయలేనని చెప్పాను. అలా చిరంజీవిగారితో సినిమాకి పనిచేసే ఛాన్స్ వదులుకోవలసి వచ్చింది" అంటూ చెప్పుకొచ్చారు. 



More Telugu News