ఫ్రీ బీర్లు అనగానే ఎగబడ్డ జనం.. వ్యాపారి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..!

  • ఫోన్లు కొంటే ఉచిత బీర్ అంటూ వ్యాపారి ఆఫర్‌
  • ఎగబడ్డ జనం, ట్రాఫిక్‌కు అంతరాయం
  • వ్యాపారిని అరెస్టు చేసిన పోలీసులు, షాపుకు తాళం
తన వ్యాపారాన్ని పెంచుకోవాలనుకున్నాడో స్మార్ట్ ఫోన్ షాపు యజమాని. ఈ క్రమంలో ఆయన ఎవరూ ఊహించని ఆఫర్‌ను ప్రకటించాడు. తన షాపులో ఫోన్లు కొన్నవారికి ఉచితంగా బీర్లు అందిస్తామని ఘనంగా ప్రకటించుకున్నాడు. ఇదే అతడి కొంప ముంచింది. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో చివరకు ఆయన కటకటాల పాలయ్యాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లో బదోహీ జిల్లాలకు చెందిన రాజేశ్ మౌర్య ఓ స్మార్ట్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్నారు. అమ్మకాలు పెంచుకునేందుకు అతడు ఉచిత బీర్ల పథకానికి తెరలేపారు. మార్చి 3 నుంచి 7వ తారీఖుల్లో తన షాపులో ఫోన్లు కొన్నవారికి రెండు బీర్ క్యాన్లు ఉచితంగా ఇస్తానని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ప్రచారం చేసుకున్నారు. దీంతో.. జనం నుంచి భారీ స్పందన వచ్చింది. ఆయన షాపు ముందు భారీగా జనం గుమికూడి రచ్చరచ్చ చేశారు. దీంతో.. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 

షాపు యజమాని ఆఫర్‌కు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అక్కడున్న గుంపును చెదరగొట్టి మౌర్యను ఐపీసీ సెక్షన్ 151 కింద అరెస్టు చేశారు. ఆయన దుకాణాన్ని సీల్ వేశారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.


More Telugu News