నంద్యాల జిల్లాలో దారితప్పి ఊర్లోకొచ్చిన పులి కూనలు.. కుక్కల బారి నుంచి కాపాడిన గ్రామస్థులు!

  • నంద్యాల జిల్లా పెద్దగుమ్మడాపురంలో ఘటన
  • నాలుగు పులికూనలను రక్షించి అటవీ అధికారులకు గ్రామస్థుల సమాచారం
  • పాలు లేకపోవడంతో బాగా నీరసించి పోయిన పులి పిల్లలు
  • అడవిలో వదిలినా వెళ్లని వైనం
  • దాని తల్లి సమీపంలోనే ఉంటుందని భయపడుతున్న గ్రామస్థులు
తల్లి నుంచి విడిపోయి దారితప్పిన నాలుగు పెద్ద పులి పిల్లలు గ్రామంలోకి వచ్చేశాయి. శునకాలు వాటిని చూస్తే చంపేస్తాయని భావించిన గ్రామస్థులు పులి పిల్లలను పట్టుకుని తీసుకెళ్లి ఓ గదిలో బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ శివారులో జరిగిందీ ఘటన. 

గ్రామస్థుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న ఆత్మకూరు టైగర్ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ అలాన్ చోంగ్ టెరాన్, సున్నిపెంట బయోడైవర్సిటీ రేంజ్ అధికారి మహ్మద్ హయత్ పులి పిల్లలను పరిశీలించారు. తల్లి నుంచి విడిపోయి చాలా సమయం కావడంతో పాలు అందక బాగా నీరసించిపోయినట్టు గుర్తించారు. 

వాటి ముందు ఐస్‌క్రీం, సెరెలాక్, పాలు వంటి వాటిని పెట్టినా అవి ముట్టలేదు. వాటిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టినా కదల్లేదు. దీంతో వాటిని బైర్లూటి వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. పులి కూనలన్నీ ఆడవేనని, ఒకేసారి నాలుగు ఆడ పిల్లలకు జన్మనివ్వడం అరుదని అధికారులు తెలిపారు. కాగా, పులి పిల్లలు గ్రామంలోకి వచ్చాయంటే వాటి తల్లి సమీపంలోనే ఉంటుందని గ్రామస్థులు భయపడుతున్నారు.


More Telugu News