భారీ అప్పులు చేసిన కార్పొరేట్ సంస్థలపై ఆర్‌బీఐ నజర్

  • బ్యాంకు రుణాలు పొందిన 20 కార్పొరేట్ సంస్థలపై రిజర్వ్ బ్యాంకు దృష్టి
  • ‘అదానీ’ కలకలం నేపథ్యంలో ఆర్‌బీఐ చర్యలు
  • కార్పొరేట్ రుణాలతో బ్యాంకులకు ప్రమాదం ఎంతనేదానిపై పరిశీలన
బ్యాంకుల నుంచి భారీగా అప్పులు చేసిన 20 బడా కార్పొరేట్ సంస్థలపై రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వాటి కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తోందని సమాచారం. ఆయా కార్పొరేట్లతో భవిష్యత్తులో కలిగే ప్రమాదం ఎంత? బ్యాంకులు వాటికి ఎంత మేరకు అప్పులిచ్చాయి? తదితర అంశాలను పరిశీలిస్తునట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. 

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ వెలువరించిన నివేదిక మార్కెట్లలో తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఇతర కార్పొరేట్లపై దృష్టి పెట్టినట్టు సమాచారం. అదానీ సంస్థలు అప్పులకుప్పగా మారాయంటూ హిండెన్‌బర్గ్ సంస్థ ఈ జనవరి చివర్లో చేసిన ఆరోపణలు అదానీ సంస్థల షేర్ల ధరలపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఆయా షేర్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలడంతో సంస్థ అధిపతి గౌతమ్ అదాని అపరకుబేరుడి కిరీటాన్ని కోల్పోయారు. ఆయన ఆస్తుల మార్కెట్ విలువ భారీగా పతనమైంది. 

ఈ నేపథ్యంలో ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందినట్టు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ విషయమై అప్పట్లో ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. భారత బ్యాంకింగ్ రంగం పటిష్ఠంగా ఉందని భరోసా ఇచ్చింది. బ్యాంకుల్లో మూలధన పెట్టుబడులు, ఆస్తుల నాణ్యత, నగదు లభ్యత, లాభదాయకత తదితర అంశాలు మెరుగ్గానే ఉన్నాయని చెప్పింది. భారీ రుణాలకు సంబంధించి ఆర్‌బీఐ రూపొందించిన లార్జ్ ఎక్స్‌పోజర్ ఫ్రేమ్‌వర్క్ నిబంధనలను బ్యాంకులు పాటిస్తున్నట్టు అప్పట్లో వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ తాజాగా 20 బడా కార్పొరేట్లపై దృష్టి పెట్టిందన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.


More Telugu News