ఆ పాట పాడకుండా నన్ను గెంటేశారు: గాయని ఎల్.ఆర్.ఈశ్వరి 

  • నిన్నటి తరం గాయని ఎల్.ఆర్.ఈశ్వరి
  • కోరస్ పాటలతో తన కెరియర్ మొదలైందన్న గాయని
  • ఒక పాట సమయంలో జరిగిన అవమానం గురించి ప్రస్తావన
  • తాను అనుకున్నది జరిగిందని వెల్లడి  
తెలుగులో సింగర్స్ గా సుశీల .. జానకి వంటివారు తమ జోరును కొనసాగిస్తూ ఉండగా, ఒక విలక్షణమైన స్వరంతో ఎల్.ఆర్.ఈశ్వరి ఎంట్రీ ఇచ్చారు. 'మసక మసక చీకటిలో' .. ' భలే భలే మగాడివోయ్' .. 'ఆకులు పోకలు ఇవ్వొద్దు' వంటి పాటలు విన్నప్పుడు ఆమె చేసిన స్వర విన్యాసం గుర్తుకు వస్తుంది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"గాయనిగా నా కెరియర్ కోరస్ పాటల నుంచి మొదలైంది. మా అమ్మ కోరస్ పాడుతూ ఉండేది. చిన్నప్పుడు ఆమెతో పాటు నేను కూడా వెళుతూ ఉండేదానిని. ఆ తరువాత నేను కూడా కోరస్ పాడటం మొదలుపెట్టాను. 'సువర్ణ సుందరి' సినిమాలో 'పిలువకురా' పాటకు నేను కోరస్ పాడుతుంటే, నా వాయిస్ సరిగ్గా లేదని చెప్పి బయటికి పొమ్మన్నారు. 

"అలా నన్ను బైటికి గెంటేయడంతో నాకంటే ఎక్కువగా మా అమ్మ బాధపడింది. ఎవరైతే నన్ను బైటికి పొమ్మన్నారో వాళ్లే నా పాటను రికార్డు చేసే రోజు ఒకటి వస్తుందని అమ్మని ఓదార్చాను .. ఆ తరువాత నేను ఏడ్చాను. ఆ తరువాత నేను పెద్ద సింగర్ ను అయిన తరువాత అదే రికార్డిస్టు నా పాటలు రికార్డు చేయడం జరిగింది" అని చెప్పుకొచ్చారు.



More Telugu News