జగన్ కు దమ్ముంటే వైసీపీ బలహీనంగా ఉన్న చోట ఆయన పోటీ చేయాలి: నారా లోకేశ్ సవాల్

  • విశాఖలో జరిగింది లోకల్ ఫేక్ సమ్మిట్ అన్న లోకేశ్ 
  • జగన్ ను చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టరని వ్యాఖ్య 
  • వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో ఘన విజయం సాధిస్తానని ధీమా  
  • మా పొత్తుల గురించి జగన్ కు ఎందుకంత భయమని ప్రశ్న 
  • పులివెందులలో కాకుండా జగన్ బయట పోటీ చేయాలని సవాల్ 
ఏపీలో జగన్ కు చెందిన సాక్షి మీడియా, భారతి సిమెంట్ తప్ప మరెవరూ బాగుపడలేదని టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శించారు. తన పాదయాత్ర సందర్భంగా పీలేరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరరాజా, లులూ, జాకీ తదితర ఎన్నో కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని చెప్పారు. సీఎం అయిన వెంటనే సోలార్ కంపెనీలను జగన్ వేధించారని... పీపీఏలు రద్దు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పినా వినలేదని అన్నారు. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఒక లోకల్ ఫేక్ సమ్మిట్ అని అన్నారు. ఆ సమ్మిట్ వల్ల వచ్చే పెట్టుబడులు కానీ, ఉద్యోగాలు కానీ ఏమీ ఉండవని ఎద్దేవా చేశారు. జగన్ ను చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టరని అన్నారు. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన కంపెనీలు వైసీపీ ప్రభుత్వం గురించి ఇతర కంపెనీలకు చెపుతాయని తెలిపారు. 

జగన్ పాలనలో పారిశ్రామికాభివృద్ధి శూన్యమని లోకేశ్ అన్నారు. ఏపీలో ఇప్పటికే ఉన్న కంపెనీలు విస్తరణ చర్యలు చేపట్టడం లేదని చెప్పారు. రాష్ట్రంలో 20 వేల మంది యువత ఉద్యోగాలను కోల్పోయారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని... ఇలాంటి పరిస్థితుల్లో 175కి 175 ఎలా గెలుస్తావు జగన్ అని ప్రశ్నించారు. 

ఇప్పటి వరకు మంగళగిరిలో టీడీపీ కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచిందని... పార్టీ బలహీనంగా ఉన్న చోట గెలవాలనే తాను అక్కడ పోటీ చేశానని లోకేశ్ చెప్పారు. కుప్పంలో పోటీ చేయమని చంద్రబాబు కూడా చెప్పారని... కానీ, టీడీపీకి బలం లేని చోటే పోటీ చేస్తానని తాను చెప్పానని అన్నారు. గెలవడం కోసమే పోటీ చేయాలనుకుంటే టీడీపీకి కంచుకోటలాంటి స్థానంలో పోటీ చేసేవాడినని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో ఘన విజయం సాధిస్తానని, టీడీపీకి కంచుకోటగా మారుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల జగన్ కుటుంబానికి ఎప్పటి నుంచో అనుకూలమైన ప్రాంతమని... జగన్ అక్కడ గెలవడం పెద్ద గొప్పేమీ కాదని... దమ్ముంటే వైసీపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఆ పార్టీకి అంత బలం ఉంటే విశాఖలో వైఎస్ విజయమ్మ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. 

వివేకాను హత్య చేసింది తామేనంటూ ఎన్నికలకు ముందు సాక్షి పత్రికల్లో తప్పుడు ప్రచారం చేశారని... ఇప్పుడు సీబీఐ విచారణకు ఎవరు హాజరవుతున్నారో అందరూ చూస్తున్నారని లోకేశ్ అన్నారు. అబద్ధాలు చెప్పడంలో జగన్ ని మించినవాడు లేడని అన్నారు. నవ్వుతూ అబద్ధాలను చాలా బాగా చెపుతారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే 175 స్థానాల్లో టీడీపీ, జనసేన పోటీ చేయాలని జగన్ అంటున్నారని... మా పొత్తుల గురించి మీకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. మాకు భయపడకపోతే పాదయాత్రను అడుగడుగునా ఎందుకు అడ్డుకుంటున్నారని అడిగారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై కేసులు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు చెప్పినా... పోలీసుల చేత బలవంతంగా కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. జగన్ భయపడుతున్నారని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలే అని చెప్పారు.


More Telugu News