ఊరికే గొప్పలు చెప్పుకోవడం కాదు.. చంద్రబాబుపై బొత్స విమర్శలు

  • విశాఖలో పెట్టుబడుల సదస్సును చాలా క్రమశిక్షణతో జగన్ నిర్వహించారన్న బొత్స
  • తనలా మరెవ్వరూ సమ్మిట్ లు నిర్వహించనట్లుగా చంద్రబాబు గతంలో ప్రచారాలు చేసుకున్నారని విమర్శ
  • రాజకీయ పార్టీలకు ఏ ఎన్నికైనా ప్రతిష్ఠాత్మకమేనని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో సమ్మిట్ లు నిర్వహించారని, అయితే మరెవ్వరూ నిర్వహించనట్లుగా వాటి గురించి ఆర్భాటంగా ప్రచారాలు చేసుకున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఊరికే గొప్పలు చెప్పుకోవడం కాదని, తమలా చేసి చూపించాలని సవాల్ విసిరారు. ఆదివారం విజయనగరంలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన వైసీపీ నాయకుల సమావేశంలో బొత్స మాట్లాడారు. 

విశాఖలో చాలా క్రమశిక్షణతో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను సీఎం జగన్ నిర్వహించారని ఆయన చెప్పారు. దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారని, హుందాగా ఎంవోయూలు చేసుకున్నారని తెలిపారు. తన అధ్యక్షతనే కమిటీ వేసి, నిరంతరం పర్యవేక్షిస్తానని సీఎం చెప్పారని తెలిపారు. కేవలం ఒప్పందాలు ముఖ్యం కాదని, వాటి గ్రౌండింగ్ కూడా ముఖ్యమనేది జగన్ ఆలోచన అన్నారు. 

ఈనెల 13న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయని బొత్స చెప్పారు. ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో 2.7 లక్షల మంది ఓటర్లు ఉన్నారన్నారు. రాజకీయ పార్టీలకు ఏ ఎన్నికైనా ప్రతిష్ఠాత్మకమేనని చెప్పుకొచ్చారు.


More Telugu News