ఫోన్ లోకాదు.. రాహుల్ మెదడులోనే పెగాసెస్ ఉంది.. మధ్యప్రదేశ్ సీఎం

  • కాంగ్రెస్ డీఎన్ఏలోకి పెగాసెస్ ప్రవేశించిందన్న శివరాజ్ సింగ్ చౌహాన్
  • రాహుల్ తెలివితేటలకు జాలిపడుతున్నానంటూ సెటైర్లు
  • విదేశాల్లో దేశం పరువుతీయడం కాంగ్రెస్ కొత్త ఎజెండాగా మారిందని ఆరోపణ
కేంబ్రిడ్జి యూనివర్సిటీ వేదికగా భారత ప్రభుత్వంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. విదేశీ గడ్డపై మన దేశాన్ని విమర్శిస్తారా అంటూ ప్రశ్నిస్తోంది. దాయాది దేశం పాకిస్థాన్ కూడా ఎప్పుడూ ఇంత సాహసం చేయలేదని అంటోంది.

తన ఫోన్ లో పెగాసెస్ స్పైవేర్ ఎక్కించి నిఘా పెట్టారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా స్పందించారు. భోపాల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పెగాసెస్ ఫోన్ లో లేదని, రాహుల్ గాంధీ మెదడులో ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ డీఎన్ఏలోకి పెగాసెస్ ప్రవేశించిందని విమర్శించారు.

రాహుల్ తెలివితేటలకు జాలిపడుతున్నానంటూ శివరాజ్ చౌహాన్ సెటైర్లు వేశారు. ‘‘రాహుల్ విదేశాలకు వెళ్తారు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. విదేశాల్లో మన దేశం పరువుతీయడం కాంగ్రెస్ కొత్త ఎజెండాగా మారింది’’ అని ఆరోపించారు. రాహుల్ ను దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు.


More Telugu News