ఎంపీ అవినాశ్ రెడ్డికి మరోమారు సీబీఐ నోటీసులు

  • ఈ నెల 6న విచారణకు రావాలని పిలుపు
  • రాలేనని, విచారణ తేదీని మార్చాలని ఎంపీ అభ్యర్థన
  • తోసిపుచ్చిన అధికారులు.. రావాల్సిందేనని ఆదేశం
  • ఎంపీ తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా మరోమారు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అధికార పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే! ఈ కేసు విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు ఇప్పటికే ఆయనను రెండుసార్లు విచారించారు. తాజాగా మరోమారు విచారణకు రావాలంటూ అధికారులు నోటీసులు పంపించారు.

ఈ నెల 6 న (సోమవారం) హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని కోరారు. ఈమేరకు శనివారం రాత్రి పులివెందులలోని ఎంపీ నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు.. ఈ నోటీసులు అందజేశారు. అయితే, సోమవారం విచారణకు రాలేనంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి అధికారులకు తెలిపారు. మరో తేదీ సూచించాలని కోరగా.. అధికారులు ససేమిరా అన్నారు. 

సోమవారం తప్పకుండా విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేశారు. ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోమారు నోటీసులు అందజేశారు. సోమవారం (ఈ నెల 6న) కడపలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో సూచించారు. భాస్కర్ రెడ్డికి ఇంతకుముందు జారీ చేసిన నోటీసులలో ఈ నెల 12న విచారణకు రావాలని కోరగా.. తాజా నోటీసులలో మాత్రం ఈ నెల 6న తప్పకుండా విచారణకు రావాలని సూచించారు.


More Telugu News