దగ్గు మందుతో ఉజ్బెకిస్థాన్​లో చిన్నారుల మరణాలు.. నోయిడా ఫార్మా కంపెనీ అధికారుల అరెస్ట్

  • ముగ్గురిని అదుపులోకి తీసుకున్న యూపీ పోలీసులు
  • పరారీలో ఇద్దరు డైరెక్టర్లు
  • సదరు ఫార్మా దగ్గు మందు వాడి డిసెంబర్ లో 18 మంది చిన్నారుల మృతి
గత ఏడాది ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది చిన్నారుల మరణానికి కారణమైన దగ్గు మందును తయారు చేసిన ఆరోపణలపై నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన ముగ్గురు ఉద్యోగులను  ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. కల్తీ ఔషధాల తయారీ, విక్రయాల ఆరోపణలపై వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో భారత్ లో తయారు చేసిన దగ్గు మందును తీసుకోవడంతో, ఉజ్బెకిస్థాన్లో చిన్నారులు మరణించారని వార్తలు వచ్చాయి. సదరు దగ్గు మందును పరీక్షించగా అందులో "ఇథిలీన్ గ్లైకాల్”అనే విషపూరిత పదార్థం గుర్తించినట్టు ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ  తెలిపింది. దగ్గు మందులో నిర్ణీత ప్రమాణం కంటే ఎక్కువ మోతాదులో వాడటంతో చిన్నారులు మృతి చెందారని పేర్కొంది.

ఈ నేపథ్యంలో దగ్గు మందు తయారీ కేంద్రాన్ని అధికారులు పరిశీలించి ప్లాంట్‌లోని డాక్‌-1 మ్యాక్స్‌ దగ్గు మందు నమూనాలను సేకరించారు. కాలుష్య పరీక్షల కోసం నమూనాలను చండీగఢ్‌లోని రీజనల్ డ్రగ్స్ టెస్టింగ్ లాబొరేటరీకి పంపారు. సిడిఎస్‌సిఓ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు మారియన్ బయోటెక్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్లు సహా ఐదుగురు అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. కంపెనీ డైరెక్టర్లు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.


More Telugu News