ఆటోలోంచి కిందపడిన రూ. 500 నోట్లు.. పట్టనట్టు వెళ్లిపోయిన వైనం!

  • శ్రీకాకుళం జిల్లా మడపాం టోల్‌గేట్ వద్ద ఘటన
  • ముందు వెళ్తున్న బైక్‌ను అనుసరిస్తూ వెళ్లిన ఆటో
  • దొరికిన రూ. 88 వేలను పోలీసులకు అప్పగించిన టోల్‌గేట్ సిబ్బంది
  • ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలదై ఉంటుందని అనుమానం
శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట మండలం మడపాం టోల్‌గేట్ వద్ద ఓ ఆటోలోంచి రూ.500 నోట్లు కిందపడి కలకలం రేపాయి. అవి కిందపడిన విషయం తెలిసి కూడా ఆటోలోని వ్యక్తులు పట్టనట్టు వెళ్లిపోయారు. దీంతో టోల్‌గేట్ సిబ్బంది వాటిని సేకరించి పోలీసులకు అప్పగించారు. శుక్రవారం రాత్రి జరిగిందీ ఘటన.

పూర్తివివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం వైపు నుంచి నరసన్నపేట వైపు వెళ్తున్న ఓ ఆటో నుంచి రూ. 500 నోట్లు ఎగిరిపడ్డాయి. నోట్లు కిందపడిన విషయాన్ని ఆటోలో ఉన్నవారు గుర్తించినా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో కొందరు టోల్‌గేట్ సిబ్బంది ఆటోను వెంబడించగా, మరికొందరు కిందపడిన నోట్లను సేకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ నోట్లు ఇలా కిందపడడం కలకలం రేపింది.

ఈ సొమ్ము ఎవరికి చెంది ఉంటుందన్న విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. కిందపడిన నోట్లను ఏరిన టోల్‌గేట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చాక తమకు దొరికిన రూ. మొత్తం రూ. 88 వేలను అప్పగించారు. ఆటో వివరాలు సేకరించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని పోలీసులు తెలిపారు. అయితే, ఆటో ముందు ఓ బైక్ వెళ్తున్నట్టు గుర్తించామన్నారు. నగదు తమదేనంటూ ఎవరైనా స్పష్టమైన ఆధారాలతో వస్తే అప్పగిస్తామని తెలిపారు.


More Telugu News