చైనా బలమైన, క్రమశిక్షణ ఉన్న శత్రువు.. నిక్కీ హేలీ

  • చైనా నిఘా బెలూన్లు అమెరికాలో కనిపించడం దేశానికే అవమానకరమన్న నిక్కీ హేలీ
  • అమెరికాలో చైనా కంపెనీలు భూమి కొంటుంటే ఏం చేస్తున్నారని బైడెన్ ప్రభుత్వానికి ప్రశ్నలు 
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ప్రయత్నిస్తున్న ఇండో అమెరికన్ నిక్కీ
అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉండేందుకు ప్రయత్నిస్తున్న రిపబ్లికన్ నేత, ఇండో అమెరికన్ నిక్కీ హేలీ.. ముందస్తు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అమెరికా ప్రపంచ ఏటీఎం కాదని ఇటీవల వ్యాఖ్యానించిన ఆమె.. తాజాగా చైనా టార్గెట్ గా విమర్శలు చేశారు. అమెరికా ఇప్పటివరకు ఎదుర్కొన్న బలమైన, అత్యంత క్రమశిక్షణ కలిగిన శత్రువు కమ్యూనిస్ట్ చైనా అని అన్నారు. 

వాషింగ్టన్ లో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ లో నిక్కీ హేలీ మాట్లాడుతూ.. ‘‘అమెరికన్లు తల ఎత్తి ఆకాశం వైపు చూస్తే.. చైనా నిఘా బెలూన్లు ఆకాశంలోంచి మనల్ని చూస్తూ ఉంటాయని నా జీవితంలో ఎన్నడూ అనుకోలేదు. ఇది అవమానకరం’’ అని చెప్పారు. కరోనా తదితర అంశాలపై చైనాను జవాబుదారీగా ఉంచాలన్నారు. 

“అమెరికాలో 380,000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో చైనా కంపెనీలు ఉన్నాయి. వాటిలో కొన్ని మన సైనిక స్థావరాల పక్కన ఉన్నాయి. మరి మనం ఏం చేస్తున్నాం? శత్రువులు మన దేశంలో భూమిని కొనేందుకు అవకాశం ఇవ్వకూడదు. అలాగే ప్రతి విశ్వవిద్యాలయానికి ఒక విషయం స్పష్టం చేయాలి. ‘మీకు చైనా నిధులు కావాలా? లేక అమెరికా ప్రభుత్వం ఇచ్చే నిధులు కావాలా? మీరు ఇకపై రెండింటినీ పొందలేరు’ అని తేల్చిచెప్పాలి’’ అని వివరించారు. 

అమెరికా శకం ముగిసిపోయిందని చైనా భావిస్తోందని, అలా అనుకుంటే తప్పేనని నిక్కీ అన్నారు. ప్రభుత్వ ఫారిన్ పాలసీపై విమర్శలు చేసిన ఆమె.. అమెరికాను ద్వేషించే దేశాలకు సహాయం చేయరాదని స్పష్టం చేశారు.

నిక్కీ హేలీ గతంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పని చేశారు. తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ఫిబ్రవరి 14న ప్రకటించారు. ప్రస్తుతానికి బరిలో ఉన్న ఏకైక మహిళ నిక్కీనే. అయితే సొంత పార్టీకి చెందిన నేత, అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నుంచి ఈమెకు గట్టిపోటీ ఎదురవుతోంది.


More Telugu News