పెరుగుతున్న సముద్ర మట్టంతో చెన్నై, కోల్ కతాలకు రిస్క్

  • 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా పలు తీర పట్టణాలకు ముప్పు
  • గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలతో సముద్ర జలాల్లో హెచ్చుతగ్గులు
  • మరింతగా వరదల ముప్పు ఉంటుందన్న అధ్యయనం
పెరిగే సముద్ర మట్టంతో ఈ శతాబ్దం చివరికి ప్రపంచవ్యాప్తంగా పలు తీర పట్టణాలకు పెద్ద ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది. నేచర్ క్లైమేట్ చేంజ్ మేగజైన్ లో ఈ అధ్యయనం ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఇప్పటి మాదిరే అధిక స్థాయిలో గ్రీన్ హౌస్ గ్యాస్ లను విడుదల చేస్తూ పోతే 2100 నాటికి చెన్నై, కోల్ కతా, యాంగాన్, బ్యాంకాక్, హోచి మించ్, మనీలా పట్టణాలు గణనీయమైన ముప్పు ఎదుర్కొంటాయని అధ్యయనం పేర్కొంది.

వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాల్లో హెచ్చుతగ్గులపై పడే ప్రభావంపై ఈ అధ్యయనం దృష్టి సారించింది. సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయని చాలా కాలంగా శాస్త్రవేత్తలు భావిస్తూ వస్తున్నారు. సముద్ర జలాలు వేడెక్కితే వాటి పరిమాణం విస్తరిస్తుందన్నది వీరి నమ్మకం. అలాగే, అధిక ఉష్ణోగ్రతలకు మంచు ఫలకాలు కరగడం కూడా సముద్ర మట్టాలు పెరిగేందుకు దారితీస్తుందని నమ్మేవారు.

కానీ, తాజా అధ్యయనంలో భాగంగా.. ఎల్ నినో తదితర వాటి వల్ల సముద్ర మట్టాలలో వచ్చే హెచ్చు, తగ్గులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. సముద్ర అంతర్గత వాతావరణ వైవిధ్యంలో వచ్చే మార్పులతో కొన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం ఇప్పుడున్న దానితో పోలిస్తే 20-30 శాతం పెరుగుతుందని తెలుసుకున్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున వరదలు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఒక్క మనీలానే తీసుకుంటే 2006తో పోలిస్తే 2100 నాటికి వరదలు 18 రెట్లు పెరుగుతాయని అధ్యయనం పేర్కొంది.


More Telugu News