తిరుమల నడకదారి భక్తులకు శుభవార్త.. త్వరలో దివ్యదర్శనం టోకెన్ల జారీ

  • అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గంలో వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు
  • రెడీ అవుతున్న సాఫ్ట్‌వేర్
  • శ్రీవాణి దర్శన టికెట్లు ఉన్న భక్తులకు ఎస్ఎన్‌జీహెచ్, ఏటీజీహెచ్ అతిథి గృహాల్లో గదుల కేటాయింపు
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నడకదారిలో వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్‌న్యూస్ చెప్పింది. అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో వచ్చే భక్తులకు త్వరలో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనుంది. నడక మార్గాల్లో వచ్చే భక్తుల్లో 60 శాతం మంది వద్ద దర్శన టికెట్లు ఉండడం లేదని గుర్తించామని, కాబట్టి వారికి దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించినట్టు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నామని, అది అందుబాటులోకి రాగానే టోకెన్ల జారీ ప్రారంభిస్తామన్నారు. 

శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులకు తిరుమలలోని ఎస్ఎన్‌జీహెచ్, ఏటీజీహెచ్ అతిథి గృహాల్లో 88 గదులు కేటాయించినట్టు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో తిరుమలకు 10 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5న జరిగే శ్రీసీతారాముల కల్యాణంలో ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని తెలిపారు.


More Telugu News