ప్రముఖ రచయిత్రి, ఆరుద్ర భార్య రామలక్ష్మి కన్నుమూత

  • గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న రామలక్ష్మి
  • 1954లో ఆరుద్రతో వివాహం
  • 15కుపైగా నవలలు రాసిన రామలక్ష్మి
  • పలు సినిమాలకు కథలు, మాటలు అందించిన వైనం
ప్రముఖ రచయిత్రి, ఆరుద్ర అర్ధాంగి కూచి రామలక్ష్మి కన్నుమూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న రామలక్ష్మి నిన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో హైదరాబాద్ మలక్‌పేటలోని తన పెద్ద కుమార్తె కవిత ఇంట్లో తుదిశ్వాస విడిచారు. కె.రామలక్ష్మిగా తెలుగు సినీ, సాహిత్య రంగాలకు చిరపరిచితులైన ఆమె కాకినాడ సమీపంలోని కోటనందూరులో 31 డిసెంబరు 1930లో జన్మించారు. ఆమె తండ్రి కూచి అచ్యుత రామయ్య భాషాపండితుడు. 

అప్పట్లోనే బీఏ పూర్తి చేసిన రామలక్ష్మి.. సీనియర్ జర్నలిస్ట్ ఖాసా సుబ్బారావు ప్రోత్సాహంతో ‘తెలుగు స్వతంత్ర’ పత్రిక ఆంగ్ల విభాగంలో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే ఆమెకు ఆరుద్ర, శ్రీశ్రీ వంటి సాహితీవేత్తలతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 1954లో ఆరుద్రను వివాహం చేసుకున్నారు. ఆరుద్ర సాహిత్యానికి ఆమె తొలి విమర్శకురాలు. ఆంధ్రపత్రికలో చాలాకాలంపాటు ‘ప్రశ్నావళి’ శీర్షిక ద్వారా పాఠకుల ప్రశ్నలకు రామలక్ష్మి సమాధానాలు ఇచ్చేవారు. సెన్సార్ బోర్డు సభ్యురాలిగానూ పనిచేశారు. 

తెలుగు సాహిత్య రంగంలోని కవులు, రచయితల దాంపత్య జీవితాలను ప్రస్తావిస్తూ ‘వెలసిపోయిన దాంపత్యం’ పేరుతో ఆమె పుస్తకం రాశారు. అలాగే, విడదీసే రైలు బళ్లు, మెరుపుతీగ, అవతలిగట్టు, తొణికిన స్వర్గం, ప్రేమించు ప్రేమకై, ఆంధ్ర నాయకుడు వంటి 15కుపైగా నవలలు రాశారు. అలాగే, జీవనజ్యోతి, చిన్నారి పాపలు వంటి సినిమాలకు కథ, మాటలు అందించారు. ఆమె రాసిన కథ ఆధారంగానే గోరింటాకు సినిమా తెరకెక్కింది. 

ఆరుద్ర-రామలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా, రెండో అమ్మాయి రౌద్రి కొన్నేళ్ల క్రితం కన్నుమూశారు. చిన్న కుమార్తె త్రివేణి అమెరికాలో స్థిరపడ్డారు. నిన్న సాయంత్రం 4 గంటలకు ఎస్సార్ నగర్‌లోని విద్యుత్ దహనవాటికలో అంత్యక్రియలను జరిపినట్టు కుమార్తె కవిత తెలిపారు.


More Telugu News