విద్యాహక్కు చట్టంపై జీవో నెం.24.... మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ హైకోర్టు

  • జీవో నెం.24ను సవాల్ చేసిన ప్రైవేటు విద్యాసంస్థలు
  • నేడు హైకోర్టులో విచారణ
  • తుది తీర్పుపై ఆధారపడి తదుపరి చర్యలు ఉంటాయన్న హైకోర్టు
  • ఆ విషయాన్ని నోటిఫికేషన్ లో పేర్కొనాలని విద్యాశాఖకు ఆదేశాలు
విద్యా హక్కు చట్టంపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.24పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా హక్కు చట్టానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.24ను యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ ఫెడరేషన్, ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ హైకోర్టులో సవాల్ చేశాయి. 

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు బి.ఆదినారాయణరావు, వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం... జీవో నెం.24ను అనుసరించి ఇచ్చిన నోటిఫికేషన్, దానిపై తదుపరి చర్యలు తాము ఇచ్చే తుది తీర్పుపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని నోటిఫికేషన్ లో స్పష్టం చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. 

కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు మార్చి 10 వరకు అవకాశం ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.


More Telugu News