పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డికి వార్నింగ్ ఇచ్చిన నారా లోకేశ్

  • పెద్దిరెడ్డి రూ. 10 వేల కోట్లను దోచుకున్నారని లోకేశ్ ఆరోపణ
  • పెద్దిరెడ్డిని ఇంటికి పంపిస్తామని వ్యాఖ్య
  • మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తామని హామీ
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఒక సభలో లోకేశ్ మాట్లాడుతూ పెద్దిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో పెద్దిరెడ్డిని పెద్దాయన అని పిలవాలంట అని విమర్శించారు. భూములు దోచుకున్నందుకు పెద్దాయన అని పిలవాలా? మట్టిని, ఇసుకను దోపిడీ చేసినందుకు పెద్దాయన అని పిలవాలా? దేనికి పిలవాలని ప్రశ్నించారు. 

జగన్ రెడ్డి రాష్ట్రానికి అమూల్ డైరీని తీసుకొచ్చారని... కానీ పుంగనూరులో మాత్రం అమూల్ డైరీ లేదని విమర్శించారు. పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డైరీ కోసమే అమూల్ ను ఇక్కడకు తీసుకురాలేదని దుయ్యబట్టారు. పాలకు తక్కువ ధరను చెల్లిస్తూ పాడి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. 

అటవీశాఖకు చెందిన భూములను కబ్జా చేశారని ఆరోపించారు. రూ. 10 వేల కోట్లను పాపాల పెద్దిరెడ్డి దోచుకున్నారని... ఆయనను శాశ్వతంగా ఇంటికి పంపిస్తామని... దోచుకున్నదంతా కక్కించి పుంగనూరు ప్రజలకు కానుకగా ఇస్తామని చెప్పారు. తాము తగ్గేదే లేదని, ఏం చేసుకుంటావో చేసుకో పెద్దిరెడ్డీ అంటూ సవాల్ విసిరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తామని... ఈ జిల్లాలో మదనపల్లి, పీలేరు, పుంగనూరులను కలుపుతామని హామీ ఇచ్చారు.


More Telugu News