గవర్నర్ పై సుప్రీంకు బీఆర్ఎస్ సర్కారు.. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గర్లోనే ఉందన్న తమిళిసై

  • తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశిస్తూ తమిళిసై తీవ్ర విమర్శలు
  • సీఎస్ గా బాధ్యతలు స్వీకరించాక మర్యాదపూర్వకంగా రాజ్ భవన్ కు వచ్చి కలవలేదని వ్యాఖ్య
  • మరోసారి ప్రొటోకాల్ పాటించలేదని మండిపాటు
  • మళ్లీ గుర్తు చేస్తున్నా.. ఢిల్లీ కంటే రాజ్ భవనే దగ్గరగా ఉందని ట్వీట్
తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. రోజుకో కొత్త వివాదం పుట్టుకొస్తోంది. బీఆర్ఎస్ సర్కారు ప్రొటోకాల్ పాటించడం లేదని గవర్నర్.. తమకు గవర్నర్ సహకరించడం లేదని ప్రభుత్వం పరస్పరం విమర్శలు చేసుకోవడం తెలిసిందే. 

తాము అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ పెండింగ్ లో పెట్టారని.. వాటికి ఆమోదం తెలిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ట్విట్టర్ వేదికగా గవర్నర్ తమిళిసై స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. 

‘‘డియర్ తెలంగాణ సీఎస్.. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరలోనే ఉంది. సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మర్యాదపూర్వకంగా రాజ్ భవన్ కు వచ్చి కలవలేదు. ప్రొటోకాల్ పాటించలేదు. కనీసం మర్యాదపూర్వకంగా ఫోన్ కూడా చేయలేదు. స్నేహపూర్వకంగా నిర్వహించే అధికారిక సందర్శనలు, సంప్రదింపులు మరింత సహాయకారిగా ఉంటాయి. కానీ మీరు అందుకు కనీసం ఇష్టపడటం లేదు’’ అని పేర్కొన్నారు.

పెండింగ్ బిల్లుల సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం వస్తుందని పరోక్షంగా చెప్పారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటాన్ని ఎత్తిచూపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదని మరోసారి ప్రస్తావించారు. ‘‘మళ్లీ గుర్తు చేస్తున్నా.. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరగా ఉంది’’ అంటూ మరో ట్వీట్ చేశారు.


More Telugu News