ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఇళంగోవన్ ఘన విజయం

  • అన్నాడీఎంకే అభ్యర్థిపై 66,233 ఓట్ల తేడాతో విజయం
  • నియోజకవర్గంలో తొలిసారి లక్షకుపైగా ఓట్లు సాధించిన వ్యక్తిగా రికార్డు
  • 34 సంవత్సరాల తర్వాత అసెంబ్లీలో కాలుపెట్టబోతున్న ఇళంగోవన్
  • క్రెడిట్ మొత్తం ముుఖ్యమంత్రిదేనన్న కాంగ్రెస్ నేత
తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్ (75) ఘన విజయం సాధించారు. అధికార డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (ఎస్‌పీఏ) అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన అన్నాడీఎంకే అభ్యర్థి కేఎస్ థెన్నరసుపై 66,233 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగ్గా నిన్న ఫలితాలు విడుదలయ్యాయి. ఇళంగోవన్‌కు 1,10,156 ఓట్లు పోలవగా, థెన్నరసుకు 43,923 ఓట్లు వచ్చాయి. 

టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అయిన ఇళంగోవన్ ఈ విజయంతో సరికొత్త రికార్డు సృష్టించారు. 2010లో ఈ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత లక్షకు పైగా ఓట్లు సాధించిన తొలి వ్యక్తి ఆయనే. ఘన విజయాన్ని అందుకున్న ఆయన 34 సంవత్సరాల తర్వాత తమిళనాడు అసెంబ్లీలో కాలుపెట్టబోతున్నారు. విజయానంతరం ఇళంగోవన్ మాట్లాడుతూ.. తన గెలుపు క్రెడిట్ ముఖ్యమంత్రి స్టాలిన్‌దేనని అన్నారు. డీఎంకే సుపరిపాలన, రాహుల్ గాంధీపై ప్రజలకున్న ప్రేమే తనను గెలిపించిందన్నారు.


More Telugu News