మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర 

  • పాదయాత్రకు నేడు 32వ రోజు
  • చంద్రగిరి నియోజక వర్గంలో ముగిసిన లోకేశ్ పాదయాత్ర
  • రాయవారిపల్లె వద్ద పుంగనూరు నియోజక వర్గంలోకి ప్రవేశం
  • జగన్ హాలిడే సీఎం అంటూ లోకేశ్ విమర్శలు
చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు రోజులపాటు సుదీర్ఘంగా సాగిన టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో ప్రవేశించింది. పులిచర్ల మండలం రాయవారిపల్లి వద్ద అభిమానుల కేరింతలు, బాణసంచా కాల్పుల నడుమ యువనేతకు ఘనస్వాగతం పలికారు. పుంగనూరు నియోజకవర్గ ప్రజలు యువనేతపై పూలవర్షం కురిపించారు. 

లోకేశ్ ను కలిసిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు

చంద్రగిరి నియోజకవర్గం గుమ్మడివారి ఇండ్లు క్యాంప్ సైట్ లో లోకేశ్ ను యూటీఎఫ్, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి సమస్యలను విన్నవించారు. లోకేశ్ స్పందిస్తూ... రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సైకో ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధించడమే పనిగా పెట్టుకుందని అన్నారు. భావిభారత పౌరులను తయారుచేసే గురువులను దొంగలుగా చిత్రీకరిస్తూ తప్పుడు కేసులు బనాయించడం జగన్మోహన్ రెడ్డి నీచత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. చరిత్రలో మద్యం షాపులవద్ద టీచర్లను కాపలాపెట్టిన పనికిమాలిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని తెలిపారు. 

"న్యాయమైన హక్కుల కోసం ఉపాధ్యాయులు చేసే పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయులపై అనవసర వేధింపులు, కక్షసాధింపు చర్యలు ఉండవు. ఉపాధ్యాయులపై జగన్ రెడ్డి ప్రభుత్వం బనాయించిన తప్పుడు కేసులు, సస్పెన్షన్లు ఎత్తివేస్తాం. టీచర్ల సేవలను సమర్థవంతంగా వినియోగించుకొని మెరుగైన విద్యాప్రమాణాలు తీసుకువస్తాం" అని పేర్కొన్నారు.

జగన్మోహన్ రెడ్డి హాలిడే సీఎం!

గతంలో చంద్రబాబు పాలనలో నాణ్యమైన విద్యుత్ ను రైతులకు అందించారని లోకేశ్ తెలిపారు. నేడు ట్రాన్స్ ఫార్మర్ లు కాలిపోతే పట్టించుకునే దిక్కులేదని విమర్శించారు. 

"పాల దిగుబడి తీవ్రంగా తగ్గిపోయింది. పెట్టుబడి పెరిగింది, పాలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. జగన్ రెడ్డి హాలిడే సీఎం. అందుకే క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడేలతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. చంద్రబాబు పాలనలో ఒక్కో రైతుపై తలసరి అప్పు రూ.70వేలు ఉంటే, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రూ.2.50 లక్షలకు పెంచాడు. ఏ రాష్ట్రంలోనూ రైతులపై ఇంత అప్పు లేదని కేంద్ర నివేదికలు చెబుతున్నాయి" అని వివరించారు.

రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన మంత్రులు

చంద్రబాబు సీఎంగా ఉండగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదని లోకేశ్ వెల్లడించారు. కానీ, ఇప్పుడు వ్యవసాయశాఖ మంత్రి కోర్టులో దొంగతనం చేసి సీబీఐ చుట్టూ తిరుగుతున్నాడని, రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశాడని తెలిపారు. 

మాజీమంత్రి అనిల్ కుమార్ 2021 నాటికి పోలవరం పూర్తిచేస్తానని బల్లగుద్ది చెప్పి మంత్రిపదవి నుండి పోయాడని ఎద్దేవా చేశారు. నేడు మంత్రిగా ఉన్న అంబటి రోడ్లపై డ్యాన్సులు వేస్తున్నాడే తప్ప పోలవరాన్ని పట్టించుకోవడం లేదని వ్యంగ్యం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి కనీసం పోలవరాన్ని పట్టించుకోవడం లేదని లోకేశ్ మండిపడ్డారు.

ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం!

టీడీపీ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో ముస్లింలతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. ప్రారంభంలో ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి యువనేతకు సంఘీభావం తెలిపారు. 

అనంతరం లోకేశ్ మాట్లాడుతూ... డీకేటీ పట్టాల సమస్యల పరిష్కారానికి కర్ణాటక తరహా మోడల్ అమలు చేస్తామని చెప్పారు. దూదేకుల, నూర్ బాషా కులస్తులకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఫోన్ లో ఒక్క బటన్ నొక్కితే బీసీ సర్టిఫికేట్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

"చెవిరెడ్డిని రెండు సార్లు గెలిపించారు. మీ జీవితాల్లో ఏం మార్పు రాలేదు. టీడీపీ గెలిస్తే చంద్రగిరి నియోజకవర్గానికి అభివృద్ధిని పరిచయం చేస్తాం. నాలుగు పదవులు ఉన్న చెవిరెడ్డి నియోజకవర్గ ప్రజలకు చీర , స్వీట్ బాక్స్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి రాబోతున్నాయి" అని వివరించారు.

కులధృవీకరణ పత్రాల సమస్య పరిష్కరిస్తాం

బీసీ- బీ కేటగిరీలో ఉన్న మైనార్టీకి చెందిన కొన్ని కులాల వారిని ప్రభుత్వం హిందువులుగా పరిగణించడం వలన ఉద్యోగ అవకాశాలతో పాటు అనేక హక్కులు కోల్పోతున్నారని లోకేశ్ వెల్లడించారు. "టీడీపీ గెలిచిన వెంటనే ఈ సమస్యని  పరిష్కరిస్తాం. ఉర్దూ యూనివర్సిటీ తెచ్చింది. ఉర్దూ టీచర్ పోస్టులు భర్తీ చేసింది టీడీపీ. ముస్లింలకు ఉన్నత పదవులు ఇచ్చింది టీడీపీ. ఉప మఖ్యమంత్రిగా అంజాద్ బాషా గారికి ఛాలెంజ్ విసురుతున్నా. ఎవరి పాలనలో ముస్లీంలకు మేలు జరిగిందో చర్చకు నేను సిద్దం" అని లోకేశ్ సవాల్ విసిరారు.


*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 422.8 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం – 12.5 కి.మీ.*

*యువగళం పాదయాత్ర 33వ రోజు షెడ్యూల్(3-3-2023)*

*పుంగనూరు నియోజకవర్గం*

ఉదయం

10.00 – కొమ్మురెడ్డిపల్లి (పులిచర్ల మండలం) విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

11.00 – కొత్తపేట బహిరంగసభలో యువనేత నారా లోకేష్ ప్రసంగం.

మధ్యాహ్నం 

1.00 – ఎగువ బెస్తపల్లిలో బెస్త సామాజికవర్గీయులతో సమావేశం.

1.45 - మంగళంపేట మెయిన్ సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.

2.20 – బలిజపల్లిలో భోజన విరామం

సాయంత్రం

3.30 – బలిజపల్లినుంచి పాదయాత్ర కొనసాగింపు.

5.30 – మొప్పిరెడ్డిగారిపల్లిలో స్థానికులతో భేటీ.

6.35 – పులిచర్లలో ఎస్సీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.

7.40 – కొక్కువారిపల్లి విడిది కేంద్రంలో బస.



More Telugu News