ఆర్టిఫిషియల్ స్వీట్ నర్ తో జాగ్రత్త.. హార్ట్ ఎటాక్ రిస్క్
- ఎరిత్రిటాల్ లో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ రిస్క్
- అసహజంగా బరువు పెరిగే ప్రమాదం
- జీవక్రియల సంబంధ వ్యాధులకు అవకాశం
- తాజా అధ్యయనంలో వెల్లడి
మధుమేహంతో బాధపడే వారు సాధారణంగా చక్కెరకు ప్రత్యామ్నాయమైన ఆర్టిఫిషియల్ స్విట్ నర్స్ వాడుతుంటారు. సాధారణంగా పంచదారలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. పైగా పోషకాలు ఉండవు. దీంతో ఎన్నో రకాల జీవనశైలి వ్యాధులకు కారణమవుతుంది. . అందుకని ఆధునిక జీవనశైలిలో చక్కెరలను తగ్గించాలనే సూచన వైద్యుల నుంచి వినిపిస్తోంది. దీంతో కొందరు ఆర్టిఫిషియల్ స్వీట్ నర్లను ఎంపిక చేసుకుంటున్నారు.
కానీ, ఇలాంటి ఉత్పత్తులతోనూ రిస్క్ ఉందంటున్నారు నిపుణులు. కృత్రిమ చక్కెర పదార్థాల్లో ఒక్కటైన ‘ఎరిత్రిటాల్’తో హార్ట్ ఎటాక్ రిస్క్ ఉంటుందని తాజా అధ్యయనం చెబుతోంది. క్లెవలాండ్ క్లినిక్ నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలు నేచర్ మెడిసిన్ అనే జర్నల్ లో ప్రచురితమయ్యాయి. ఈ ఎరిత్రిటాల్ ను దీర్ఘకాలం పాటు వాడినట్టయితే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ రిస్క్ పెరుగుతున్నట్టు ఈ అధ్యయనం గుర్తించింది.
అమెరికా, యూరప్ లో 4,000 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఎరిత్రిటాల్ ప్లేట్ లెట్లను యాక్టివేట్ చేసి, క్లాట్ ఏర్పడేందుకు కారణమవుతున్నట్టు తెలిసింది. ఇటీవలి కాలంలో ఎరిత్రిటాల్ మాదిరి ఆర్టిఫిషియల్ తీపి పదార్థాలకు ఆదరణ పెరుగుతోందని, దీర్ఘకాలంలో వీటి ప్రభావాలపై మరింత లోతైన పరిశోధన అవసరమని ఈ అధ్యయనంలో పాల్గొన్న స్టాన్లీ హాజెన్ పేర్కొన్నారు. క్లెవలాండ్ క్లినిక్ లో కార్డియో వాస్క్యులర్, మెటబాలిక్ సైన్సెస్ విభాగం చైర్మన్ గా ఆయన పనిచేస్తున్నారు.
పంచదారతో పోలిస్తే ఎరిత్రిటాల్ లో తీపి దనం 70 శాతంగా ఉంటుంది. మొక్కజొన్నను ఫెర్మెంట్ చేసి దీన్ని తయారు చేస్తారు. ఎరిత్రిటాల్ ను మనం తీసుకున్న తర్వాత రక్తంలో కలసిపోతుంది. తాజా పరిశోధన ఫలితాలపై ఫోర్టిస్ హాస్పిటల్ డాక్టర్ అనూప్ మిశ్రా స్పందిస్తూ.. ‘‘సాధారణంగా మేము అయితే చాలా తక్కువ పరిమాణంలో ఆర్టిఫిషియల్ స్వీట్ నర్లను సూచిస్తుంటాం. ఇకమీదట అసలే వద్దని చెబుతాం’’ అని ప్రకటించారు. కృత్రిమ తీపి పదార్థాలను తీసుకునే వారు అసహజంగా బరువు పెరిగి, జీవక్రియల సంబంధ వ్యాధుల రిస్క్ ఏర్పడుతుందని కార్డియాలజిస్ట్ మోహిత్ గుప్తా పేర్కొన్నారు.