​​మహిళల భద్రతకు భరోసా చంద్రబాబుతోనే సాధ్యం: నారా లోకేశ్

  • కొనసాగుతున్న లోకేశ్ యువగళం పాదయాత్ర
  • నేటితో 30 రోజుల యాత్ర పూర్తి
  • చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర
  • రజకులతో, మహిళలతో లోకేశ్ ముఖాముఖి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 30 రోజులు పూర్తి చేసుకుంది. 30వ రోజు పాదయాత్ర పూర్తయ్యే సమయానికి 397.3 కిలోమీటర్లకు చేరుకుంది. బుధవారం ఉదయం యువగళం పాదయాత్ర 400 కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది. 

కాగా, నేడు చంద్రగిరి నియోజకవర్గం మామండూరు విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. కాశిపెంట్ల గ్రామంలోని హెరిటేజ్ కంపెనీ ఉద్యోగులు యువనేతకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. సిబ్బందిని యువనేత ఆప్యాయంగా పలకరించారు. కాశిపెంట్ల, ముంగిళిపట్టు గ్రామం వద్ద పాదయాత్ర 30వ రోజు సందర్భంగా గ్రామస్తులు 30 నెంబరు ఆకృతితోగల కేకును లోకేశ్ తో కట్ చేయించారు. 

రజకులతో లోకేశ్ ముఖాముఖి

టీడీపీ అధికారంలోకి వచ్చాక రజకుల దోబీఘాట్లకు ఉచిత విద్యుత్ అందజేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. మామండూరు విడిది కేంద్రం నుంచి పాదయాత్రకు బయలుదేరే ముందు లోకేశ్ రజకులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రజకులను ఎస్సీల్లో చేర్చడానికి టీడీపీ గతంలో కమిటీ వేసిందని వెల్లడించారు. ఆ కమిటీ నివేదిక ప్రభుత్వం వద్ద ఉందని, టీడీపీ అధికారంలోకి రాగానే కమిటీ నివేదిక మేరకు న్యాయం చేస్తానని స్పష్టం చేశారు. 

"రజకులను రాజకీయంగా ప్రోత్సహిస్తాం. రజకులకు ఎమ్మెల్సీ ఇస్తామని 2014కు ముందు హామీ ఇవ్వలేదు..అయినా రాజకీయంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఇచ్చాం" అని వెల్లడించారు.

మరోమారు విద్యుత్ చార్జీల బాదుడుకు సిద్ధమైన జగన్!

జగన్ రెడ్డి మళ్లీ విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నాడని లోకేశ్ ఆరోపించారు. ట్రూ అప్ అనే మాట ఎప్పుడూ వినలేదని, దాని పేరుతో ఈ సీఎం అదనంగా వసూలు చేస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు సోలార్ ప్రాజెక్టులతో ఒప్పందాలు కుదుర్చుకుంటే అవినీతి అని ప్రచారం చేశాడు... నేడు ఆ పరిశ్రమలు వచ్చుంటే విద్యుత్ ఛార్జీలు తగ్గుదలతో ఉండేవని లోకేశ్ వివరించారు.

ప్రశ్నించకపోతే బతకనివ్వరు!


ప్రభుత్వాన్ని సమస్యలపై నిలదీసేందుకు యువగళం ఒక వేదిక అని లోకేశ్ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంపై ఇక తిరగబడకపోతే బతకలేమని అన్నారు. "నా జీవితంలో జైలు చూడలేదు... కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజల కోసం వెళ్లాల్సి వస్తోంది. దొంగ కేసులు పెట్టి లొంగదీసుకోవాలని చూస్తున్నారు. దొంగ కేసులు పెట్టిన అధికారులపై విచారణ వేసి, వారి బట్టలూడదీస్తాం. తప్పుడు కేసులు పెడుతుండటం వల్ల అట్రాసిటీ కేసు తీసేయాలన్న చర్చ కూడా నడుస్తోంది" అని వివరించారు.

మహిళలకు గొంతుకై నిలుస్తాం... తప్పుడు వెధవల తోలుతీస్తాం!

ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన వారిని వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా వేధిస్తోందని లోకేశ్ మండిపడ్డారు. మహిళలు భయపడాల్సిన అవసరం లేదని, జనాభాలో సగభాగం ఉన్న మహిళలు తిరగబడితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? అని అన్నారు. మీరు పోరాడండి... మీకు అండగా మేముంటామని లోకేశ్ భరోసా ఇచ్చారు. 

చంద్రగిరి నియోజకవర్గం కాశిపెంట్లలో మహిళలతో ముఖాముఖి సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ... "శ్రీకాళహస్తిలో ఓ రజక మహిళ తన సమస్యను నాకు విన్నవించుకుంది. సదరు మహిళకు సంబంధించిన టిఫిన్ బడ్డీని ధ్వంసం చేశారు. అక్కడి ఎమ్మెల్యే తన కాళ్లు పట్టుకుంటే వదిలేస్తానని ఆ మహిళను బెదిరిస్తున్నాడు. దిశచట్టం ఏం పీకుతోంది? అన్ని విధాలుగా నేను మహిళలకు అండగా ఉంటాను. మీ జోలికి వైకాపా కుక్కలు వస్తే నాకు చెప్పండి... ఆ కుక్కల తోలు తీస్తాం. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే...వాళ్లను చెప్పులతో కొట్టండి" అని పిలుపునిచ్చారు.

మహిళలకు భరోసా చంద్రబాబునాయుడే!

నాడు-నేడు-ఎప్పుడూ... చంద్రబాబే మహిళలకు భద్రత కల్పించే నాయకుడు అని లోకేశ్ ఉద్ఘాటించారు. మోసకారి హామీలతో మహిళలను నట్టేటముంచిన జగన్ మోహన్ రెడ్డిని తరిమికొట్టండి అని పిలుపునిచ్చారు. 

"ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు డ్వాక్రా సంఘాలు తెచ్చారు. నేడు ప్రతి ఇంట్లో గ్యాస్ ఉందంటే దానికి కారణం చంద్రబాబే. 1999లో దీపం పథకం ద్వారా తీసుకొచ్చారు. పండుగలకు కానుకలు కూడా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు. 2014లో పెన్షన్ రూ.200 ఉంటే దాన్ని రూ.2000 చేసింది చంద్రబాబు. పసుపుకుంకుమ, డ్వాక్రా రుణాలు మాఫీ, అభయహస్తం ద్వారా మహిళలకు ఆర్థిక సాయం చేశారు. మహిళలకు రక్షణ బాబుగారి పాలనతోనే సాధ్యం. గతంలో పల్నాడులో ఓ మహిళపై అఘాయిత్యం జరిగితే ఆ నిందితుడు పోలీసులంటే భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అదీ... చంద్రబాబు అందించే భద్రతకు నిలువెత్తు నిదర్శనం" అని వివరించారు.

పరిశ్రమలు తెమ్మంటే కోడిగుడ్డు కథలు చెబుతారా?

జగన్ ను చూస్తే జైల్ గుర్తుకొచ్చి... మన రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలు రావడం లేదని లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. నేడు పరిశ్రమలశాఖ మంత్రికి పరిశ్రమలంటే కోడి, గుడ్డు తప్ప మరేం తెలియదని చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. 

"రానున్న రోజుల్లో చంద్రబాబే సీఎం అవుతారు. మీ భద్రత మా బాధ్యత. టెక్నాలజీని మీ కాళ్ల దగ్గరకు తెస్తాం. సంక్షేమ పథకాలన్నీ మీ మొబైల్ నుండే దరఖాస్తు చేసుకుని, ఎటువంటి పైరవీలకు తావులేకుండా వాటిని పొందే విధానాన్ని తెస్తాం" అని లోకేశ్ పేర్కొన్నారు.

కొనసాగుతున్న యువనేత లోకేశ్ సెల్ఫీ చాలెంజ్!

తన యువ‌గ‌ళం పాదయాత్రలో నారా లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్‌ కొన‌సాగుతోంది. సీఎం జగన్ ను ఎద్దేవా చేసే విధంగా టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో వ‌చ్చిన కంపెనీలు, తెచ్చిన సంస్థ‌ల ముందు సెల్ఫీలు దిగి "మేము తెచ్చిన‌వి ఇవి, నువ్వు ఏం తెచ్చావు జ‌గ‌న్?" అంటూ సెటైరిక్‌గా ప్ర‌శ్నిస్తుండడం తెలిసిందే. 

తాజాగా, ఐతేప‌ల్లి వ‌ద్ద కాండోర్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు లోకేశ్ సెల్ఫీ దిగారు. ప్ర‌ఖ్యాత విద్యాసంస్థ కాండోర్ టీడీపీ హ‌యాంలోనే ఏర్పాటైంది. ఈ సంస్థ‌కి అప్ప‌ట్లో చంద్ర‌బాబు స‌ర్కారు 8 ఎక‌రాల భూమి కేటాయించింది. ఈ నేపథ్యంలో, కాండోర్ ముందు సెల్ఫీ దిగిన లోకేశ్, మేము తెచ్చిన ప్ర‌ఖ్యాత విద్యాసంస్థ ఇది అని గ‌ర్వంగా ప్ర‌క‌టించారు.

*టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 397.3 కి.మీ.*

*30వరోజు (మంగళవారం) నడిచిన దూరం – 15.8 కి.మీ.*

*యువగళం పాదయాత్ర 31వ రోజు షెడ్యూల్(1-3-2023)*

*చంద్రగిరి నియోజకవర్గం:*

ఉదయం

8.00 – గాదంకి టోల్ గేట్ (పాకాల మండలం) విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.30 – గాదంకి గ్రామంలో కాపు సామాజికవర్గ నేతలతో మాటామంతీ.

10.20 – నేండ్రగుంట వద్ద 400 కి.మీ. పూర్తయిన సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరణ.

10.30 - నేండ్రగుంట గ్రామస్తులతో మాటామంతీ.

11.55 – ఇర్రంగారిపల్లిలో యువతీయువకులతో ముఖాముఖి.

మధ్యాహ్నం

12,55 – ఇర్రంగారిపల్లిలో భోజన విరామం.

2.30 – ఇర్రంగారిపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.

సాయంత్రం

3.05 - పాకాల గ్రామంలో టైలర్లతో మాటామంతీ.

3.30– పాకాల బస్టాండు వద్ద గ్రామస్తులతో భేటీ.

4.20 – పాకాల పూలమార్కెట్ వద్ద స్థానిక వ్యాపారులతో మాటామంతీ.

4.35 – పాకాల మసీదులో ప్రత్యేక ప్రార్థనలు, మతపెద్దలతో ఆశీర్వచనం.

5.50 – గుమ్మడివారి ఇండ్లు వద్ద విడిది కేంద్రంలో బస


More Telugu News