ఢిల్లీ లిక్కర్ కేసుకు, తెలంగాణ బీజేపీకి సంబంధమేలేదు: బండి సంజయ్

  • ఢిల్లీ లిక్కర్ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందన్న బండి సంజయ్
  • కవిత పేరును చార్జిషీటులో నాలుగు సార్లు పేర్కొన్నారని వెల్లడి
  • కేసీఆర్ అప్పుడెందుకు స్పందించలేదని ప్రశ్నించిన వైనం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు, బీజేపీకి సంబంధం లేదని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. లిక్కర్ కేసు చార్జిషీటులో కవిత పేరును సీబీఐ నాలుగు సార్లు పేర్కొందని వెల్లడించారు. కవిత పేరు ప్రస్తావించినప్పుడు కేసీఆర్ ఎందుకు స్పందించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. సిసోడియా అరెస్ట్ తో, తెలంగాణ బీజేపీ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. 

ఇవాళ తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రమంత్రి అమిత్ షా, పార్టీ అగ్రనేత జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీనే అని ప్రజలు గుర్తించారని వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రంలో ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నామని, ఆ సభకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని వివరించారు.


More Telugu News