భారత్ భవిష్యత్ ను నిర్ణయించేది ఇలాంటి చిన్నారులే..: ఆనంద్ మహీంద్రా

  • హోసూర్ లో అఖిల భారత చెస్ కాంపిటిషన్
  • దీని కోసం రాత్రంతా బస్సుల్లో ప్రయాణించి చేరుకున్న చిన్నారి
  • అతడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆనంద్ మహీంద్రా
ఓ చెస్ చిచ్చర పిడుగుని ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పరిచయం చేశారు. పారిశ్రామికవేత్తగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆనంద్ మహీంద్రా, ట్విట్టర్ ప్లాట్ ఫామ్ ద్వారా కోట్లాది మందితో నిరంతరం టచ్ లో ఉంటుంటారు. ఎన్నో అరుదైన విశేషాలు, విషయాలు, ఆలోచింపజేసే, స్ఫూర్తినీయ అంశాలు, ఆవిష్కరణలను ట్విట్టర్ లో పంచుకుంటారు. తాజాగా ఓ చిన్నారి చెస్ ఛాంపియన్ ను ఆయన ప్రస్తావన చేశారు. తనకు ప్రేరణనిచ్చినట్టుగా చెప్పారు.

‘‘ఇటీవలే హోసూరులో స్కూల్ చెస్ కాంపిటీషన్ జరిగింది. 1,600 మంది చిన్నారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ బాబు రాత్రంతా బస్సులో ప్రయాణం చేసి, రెండు బస్సులు మారి పోటీ ప్రాంతానికి చేరుకున్నాడు. మ్యాచ్ కు ముందు చిన్న కునుకు తీశాడు. తదుపరి మ్యాగ్నస్ కావాలన్నది అతడి లక్ష్యం. ఇలాంటి చిన్నారులే భారత్ భవిష్యత్తును తీర్చిదిద్దేది’’ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. తాను కూడా ఏదో ఒక రోజు మ్యాగ్నస్ కార్ల్ సెన్ మాదిరిగా చెస్ గ్రాండ్ మాస్టర్ కావాలన్నది ఈ చిన్నారి ఆకాంక్ష. ఆనంద్ మహీంద్రా పోస్ట్ కు యూజర్లు చక్కగా స్పందించారు. చిన్నారుల కోసం స్టార్టప్ చెస్ ఇనిస్టిట్యూట్ ను ప్రారంభించాలంటూ సూచనలు వచ్చాయి.


More Telugu News