మేమిచ్చిన ట్యాబ్ లను సమర్థవంతంగా వినియోగించుకోండి: కేటీఆర్

  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన
  • ఎల్లారెడ్డిపేటలో విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ
  • ట్యాబ్ ల్లో అడ్డమైన కార్యక్రమాలు చేయొద్దని హితవు
  • విద్యార్థులు రాణిస్తేనే తమకు తృప్తి అని కేటీఆర్ వెల్లడి
తెలంగాణ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్ పథకంలో భాగంగా ట్యాబ్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ఊరు-మన బడి పథకంలో భాగంగా రాష్ట్రంలోని 26 వేల పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టామని వివరించారు. 

చిన్నారి తమ్ముళ్లు, చెల్లెళ్ల ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్న ఉద్దేశంతోనే గిఫ్ట్ ఏ స్మైల్ పథకంలో భాగంగా ట్యాబ్ లు అందిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. ఆకాశ్ బైజూస్ ద్వారా పోటీ పరీక్షలకు అవసరమైన సమాచారం అంతా ట్యాబ్ ల్లో పొందుపరిచి ఇస్తున్నామని తెలిపారు. అందుకు అవసరమైన సాఫ్ట్ వేర్ కూడా ఈ ట్యాబ్ ల్లో ఉందని చెప్పారు. 

ఈ ట్యాబ్ బయట కొంటే రూ.10 వేలు అవుతుందని, అందులోని సాఫ్ట్ వేర్ విలువ రూ.75 వేలు ఉంటుందని, ఇవాళ దాదాపు రూ.86 వేల విలువ చేసే ట్యాబ్ ను ఉచితంగా విద్యార్థుల చేతుల్లో పెడుతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యార్థులు చదువులో రాణిస్తే అధ్యాపకులు, తల్లిదండ్రులతో పాటు నియోజకవర్గ ప్రతినిధులుగా తామందరం సంతోషిస్తామని అన్నారు. 

అయితే, పిల్లలను తాను కోరేది ఒక్కటేనని, ఈ ట్యాబ్ లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, కేవలం చదువుల కోసమే వాడుకోవాలని పిలుపునిచ్చారు. అంతే తప్ప, దీంట్లో ఇంటర్నెట్ పెట్టి ఇన్ స్టాగ్రామ్ లు, ఫేస్ బుక్ లు వంటి అడ్డమైన కార్యక్రమాలతో టేమ్ వేస్ట్ చేసుకోవద్దు అని కేటీఆర్ స్పష్టం చేశారు. 

వేములవాడ నియోజకవర్గంలోనూ మరో 3 వేల ట్యాబ్ లు అందించబోతున్నామని వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో విద్యార్థులు ర్యాంకులు సాధించినప్పుడే, తాము ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు తృప్తి కలుగుతుందని వివరించారు.


More Telugu News