పశ్చిమ బెంగాల్ లో వైద్యులను ఆందోళనకు గురి చేస్తున్న అడెనో వైరస్

  • 24 గంటల్లో కోల్ కతాలో వైరస్ వల్ల ముగ్గురు చిన్నారుల మృతి
  • వైరస్ సోకిన వారిలో ఫ్లూ మాదిరి జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు
  • గత మూడు నెలల్లో 15 మంది వరకు మరణించినట్టు సమాచారం
అడెనో వైరస్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వైద్యులను, ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. రెండేళ్లలోపు చిన్నారులను ఈ వైరస్ బలి తీసుకుంటుండడమే ఈ ఆందోళనకు కారణం. మరీ ముఖ్యంగా కోల్ కతాలో ఈ నెల 27న ముగ్గురు చిన్నారులు ఈ వైరస్ వల్ల మరణించారు. దీంతో ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందా? అన్న ఆందోళన పెరిగింది. మరణించిన ముగ్గురిలో తొమ్మిది నెలలు, ఎనిమిది నెలలు, ఏడాదిన్నర శిశువులు ఉన్నారు. 

మరణించిన ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన డాక్టర్ బీసీ రాయ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెడియాట్రిక్ సైన్సెస్ లో కన్నుమూయడం గమనార్హం. ఒక బేబీకి 12 రోజుల పాటు చికిత్స చేసి, డిశ్చార్జ్ చేసిన తర్వాత సమస్యలు మొదలై ప్రాణాలు విడిచింది. 

గడిచిన రెండు నెలలుగా కోల్ కతాలో దగ్గు, జలుబు, తీవ్ర శ్వాస కోస సమస్యల బారిన పిల్లలు పడుతున్నారు. ముఖ్యంగా రెండేళ్లలోపు పిల్లలు ఈ లక్షణాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారనీ, కొందరికి వెంటిలేషన్ సపోర్ట్ అవసరమవుతోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ వైరస్ వల్ల 15 మంది చిన్నారులు మరణించారని, పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ వైద్యుడు తెలిపారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్ ల్యాబ్ కు 500 నమూనాలు పంపగా, 33 శాతం అడెనో వైరస్ పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది.

ఈ వైరస్ సోకిన వారిలో ఫ్లూ మాదిరి జలుబు, దగ్గు, శ్వాసకు ఇబ్బంది తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. అన్ని వయసుల వారికి ఇది వచ్చేదే అయినా, ముఖ్యంగా పిల్లలకు రిస్క్ ఎక్కువని కోల్ కతాకు చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ అమితవ నంది తెలిపారు. పిల్లల వ్యాధి నిరోధక సామర్థ్యంపైనే వైరస్ ప్రభావం ఆధారపడి ఉంటుందన్నారు. మాస్క్ లు ధరించి, శానిటైజర్లు వాడాలని, సొంత వైద్యం చేసుకోకుండా ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.


More Telugu News