రిమోట్ ఎవరి చేతిలో ఉందో అందరికీ తెలుసన్న మోదీ.. అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చిన ఖర్గే

  • మల్లికార్జున ఖర్గేను గాంధీ కుటుంబం అవమానించిందన్న మోదీ
  • మీ బెస్ట్ ఫ్రెండ్ ఆకాశం నుంచి పాతాళం వరకు లూటీ చేశారన్న ఖర్గే
  • అదానీపై జేపీసీ ఎప్పుడు వేస్తారని ప్రశ్న
కర్ణాటకలో క్రమంగా ఎన్నికల వేడి పుంజుకుంటోంది. ఏప్రిల్ లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మే నెల కల్లా అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అప్పుడే కార్యాచరణను మొదలు పెట్టింది. ప్రధాని మోదీ నిన్న కర్ణాటకలో పర్యటించారు. బెలగావిలో ఆయన రైతులకు రూ. 16 వేల కోట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. 

కర్ణాటకను కాంగ్రెస్ చాలా ద్వేషిస్తోందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాలనుకుంటున్నానని... కర్ణాటక కీలక నేతలను ఆ పార్టీ ముందు నుంచి కూడా అవమానిస్తోందని మోదీ చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ లో పెద్ద నాయకుడైన మల్లికార్జున ఖర్గేను కేవలం పేరుకే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేశారని... పార్టీ రిమోట్ ఎవరి చేతుల్లో ఉందో అందరికీ తెలుసని అన్నారు. ఒక కుటుంబం (గాంధీలు) చేతిలో కాంగ్రెస్ నాయకత్వం ఉందని... ఇటీవల రాయ్ పూర్ లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీలో కూడా ఆ కుటుంబం ఖర్గేను అవమానించిందని చెప్పారు. ప్రజలకు ఖర్గే ఎన్నో విధాలుగా సేవ చేశారని... సీనియర్ నేత అయిన ఖర్గేను అలా అవమానించడం తనకు కూడా బాధను కలిగించిందని అన్నారు. 

మరోవైపు మోదీ వ్యాఖ్యలపై ఖర్గే అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. ఏ గొడుగు కింద మీ బెస్ట్ ఫ్రెండ్ దేశంలో ఆకాశం నుంచి పాతాళం వరకు లూటీ చేశారని ప్రశ్నించారు. అదానీ మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎప్పుడు వేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశం నుంచి 'కంపెనీ రాజ్'ను తరిమికొట్టి, స్వాతంత్ర్యాన్ని సాధించిన ఘనత కాంగ్రెస్ దని... మళ్లీ కంపెనీ రాజ్ ను దేశంలోకి అనుమతించబోమని అన్నారు.


More Telugu News