ఇస్లామిక్ స్టేట్ టాప్ కమాండర్లను హతమార్చిన తాలిబన్ బలగాలు

  • ఐఎస్‌కేపీ టాప్ కమాండర్లు అయిన ఖారీ ఫతే, ఎజాజ్ అహ్మద్ హతం
  • ఎజాజ్ అహ్మద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత ప్రభుత్వం
  • ఖారీ ఫతే ఐఎస్‌కేపీ ఇంటెలిజెన్స్ చీఫ్
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఇద్దరు టాప్ కమాండర్లను హతమార్చినట్టు తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. హతుల్లో ఒకరైన ఖారీ ఫతే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ) ఇంటెలిజెన్స్ చీఫ్, మాజీ మంత్రి అని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఇస్లామిక్ స్టేట్‌ ఆఫ్ఘనిస్థాన్ అనుబంధ సంస్థే ఐఎస్‌కేపీ. ఇది తాలిబన్లకు బద్ధ విరోధి.

ఖారీ ఫతే ఐఎస్‌కేపీ ప్రధాన వ్యూహకర్త అని, కాబూల్‌లోని రష్యా, పాకిస్థాన్, చైనా దౌత్య కార్యాలయాలు అనేక దాడులకు అతడు ప్లాన్ చేసినట్టు ముజాహిద్ పేర్కొన్నారు. అలాగే, ఎన్‌కౌంటర్‌లో మరణించిన మరో ఉగ్రవాదిని ఎజాజ్ అహ్మద్ అహంగర్‌గా గుర్తించారు. అతడు ఇస్లామిక్ స్టేట్ హింద్ ప్రావిన్స్ (ఐఎస్‌హెచ్‌పీ) దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లోని ఐఎస్‌కేపీ సీనియర్ నాయకుడు.  

అబు ఉస్మాన్ అల్-కశ్మీరీగా చిరపరిచతుడైన అహంగర్‌ను భారత ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఉగ్రవాదిగా ప్రకటించింది. శ్రీనగర్‌లో పుట్టిన అహంగర్ ఉగ్రకార్యకలాపాలకు గాను రెండు దశబ్దాలుగా జమ్మూకశ్మీర్‌లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. మార్చి 2020లో కాబూల్‌లోని గురుద్వారా కార్ట్-ఇ-పర్వాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడికి అహంగర్ ప్రధాన సూత్రధారిగా ఆఫ్ఘనిస్థాన్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఆ ఘటనలో ఓ సెక్యూరిటీ గార్డు సహా 24 మంది మరణించారు.  అతడికి అల్ ఖైదా, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.


More Telugu News