ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు విచారణ... జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు!

  • తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు
  • సీఎం పెన్ డ్రైవ్ లు జడ్జిలకు పంపడం సరికాదన్న జస్టిస్ గవాయ్
  • ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్పిన న్యాయవాది దవే
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

కేసుకు సంబంధించి పెన్ డ్రైవ్ లు న్యాయమూర్తులకు పంపడం సరికాదని అన్నారు. సీఎం నుంచి నేరుగా పెన్ డ్రైవ్ లు తమకు చేరడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్నవారు ఇలా ప్రవర్తిస్తారా? అంటూ ఆక్షేపించారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే, సిట్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది కదా? అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. 

తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ కేసులో న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. "ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ఆ పార్టీ అధినేత చూస్తూ ఊరుకుంటారా? జరిగిన కుట్రను వెల్లడించకూడదా? బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి సీబీఐ విచారణ పారదర్శకంగా జరిగే అవకాశం లేదని వారు భావించారు. దేశంలో విపక్షాలపై జరుగుతున్న దాడులను చూస్తున్నాం. ఇప్పటివరకు బీజేపీ 8 ప్రభుత్వాలను కూల్చిన దృష్టాంతాలు ఉన్నాయి" అని వివరించారు. 

సీఎం కేసీఆర్ జడ్జిలకు పెన్ డ్రైవ్ లు పంపడం పట్ల న్యాయవాది దవే తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు క్షమాపణలు తెలియజేశారు.


More Telugu News