హాలీవుడ్ అవకాశాలపై రామ్ చరణ్ గురి!

  • అమెరికా సినీ పరిశ్రమలో భాగం కావాలని కోరుకుంటున్నట్టు వెల్లడి
  • భారత్ లోని ప్రతిభను ఇక్కడి దర్శకులు గుర్తించాలని సూచన
  • అమెరికా టీవీ చానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్న రామ్ చరణ్
నటుడు రామ్ చరణ్ తేజ్ హాలీవుడ్ పరిశ్రమలో అవకాశాలపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా రూపంలో వచ్చిన గుర్తింపును తదుపరి కెరీర్ అభివృద్ధికి, హాలీవుడ్ ఎంట్రీకి మార్గంగా చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లు, ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని రామ్ చరణ్ అమెరికా పర్యటనకు వెళ్లడం తెలిసిందే. సుదీర్ఘ పర్యటన అనే దీన్ని చెప్పుకోవాలి. ఈ నెల 21న రామ్ చరణ్ అమెరికాకు వెళ్లాడు. మార్చి 13న ఆస్కార్ అవార్డుల ప్రదానం కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాతే ఆయన తిరిగి భారత్ కు రానున్నాడు. 

తన సుదీర్ఘ అమెరికా పర్యటనలో భాగంగా రామ్ చరణ్ పలు టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. భారత్ వెలుపల అవకాశాల పట్ల తన ఆసక్తిని ఈ సందర్భంగా రామ్ చరణ్ వ్యక్తం చేశాడు. ‘‘ఇక్కడి దర్శకులు భారత్ లో ఉన్న ప్రతిభను ఓసారి గమనించాలని కోరుకుంటున్నాను. మీ పరిశ్రమలోనూ (అమెరికా చిత్ర పరిశ్రమ) భాగం కావాలని అనుకుంటున్నాను. చక్కని కాల్స్, సమావేశాలు జరుగుతాయని ఆశిస్తున్నాను’’అని రామ్ చరణ్ పేర్కొన్నాడు. ‘‘హెచ్ సీ ఏ క్రిటిక్స్ 2023 కు రాజమౌళి గారు, కీరవాణి గారితో కలిసి భారత సినిమాకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. మాకు లభించిన గౌరవానికి గర్వపడుతున్నాను’’అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేయడం గమనార్హం. 

మరోవైపు మార్చి 1న ఏస్ హోటల్ వద్ద ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శించనున్నారు. అమెరికాలో మార్చి 3న 200 థియేటర్లలో ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు ఈ కార్యక్రమానికి ప్లాన్ చేశారు. దీని కోసం రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ కూడా అమెరికాకు వెళ్లారు.


More Telugu News