గుడ్ న్యూస్.. మే 3 వరకు అధిక పెన్షన్ కోసం దరఖాస్తుకు ఈపీఎఫ్ వో అనుమతి

  • 2014 సెప్టెంబర్ 1 నాటికి సభ్యులై ఉండాలి
  • ఆ తర్వాత కూడా సభ్యులుగా కొనసాగుతున్న వారికే అదనపు గడువు
  • 2014 సెప్టెంబర్ 1 నాటికి రిటైర్ అయిన వారికి మార్చి 3 వరకే గడువు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ వో) మరింత గడువు ఇచ్చింది. 2014 సెప్టెంబర్ 1 నాటికి ఈపీఎఫ్ వో సభ్యులుగా ఉన్నవారు అధిక పెన్షన్ కోసం అర్హులు అంటూ సుప్రీంకోర్టు 2022 నవంబర్ 4న ఆదేశాలు జారీ చేసింది. ఈపీఎఫ్ వో నిర్వహించే ఎంప్లాయీ పెన్షస్ స్కీమ్ కింద అధిక పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవడానికి సుప్రీంకోర్టు నాలుగు నెలల గడువు ఇచ్చింది. ఆ ప్రకారం మార్చి 3తో గడువు ముగుస్తుంది. ఇంత తక్కువ వ్యవధిలో దరఖాస్తు చేసుకోవడం ఎలా సాధ్యపడుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతుండడంతో ఈపీఎఫ్ వో ప్రకటన చేసింది.

ఈ ఏడాది మే 3 వరకు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించింది. దీంతో అధిక శాతం మంది ఉద్యోగులకు ఊరట లభించినట్టయింది. అయితే, ఇది అందరికీ కాదు. 2014 సెప్టెంబర్ 1 నాటికి ఈపీఎఫ్ వో సభ్యులుగా ఉండి, ఆ తర్వాత కూడా సభ్యులుగా కొనసాగుతూ, గతంలో అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోని వారికే పొడిగించిన గడువు అమలు అవుతుందని ఈపీఎఫ్ వో తెలిపింది.

2014 సెప్టెంబర్ 1కి ముందు పదవీ విరమణ పొంది, అధిక పెన్షన్ ఆప్షన్ ను ఎంపిక చేసుకున్నప్పటికీ, ఈపీఎఫ్ వో నాడు తిరస్కరించి ఉంటే.. అటువంటి అభ్యర్థులు మార్చి 3లోపే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ వో తాజా నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇంకా జారీ చేయలేదు. కాకపోతే ఈపీఎఫ్ వో సేవా పోర్టల్ లో ఈ వివరాలు పేర్కొంది. 


More Telugu News