కేసీఆర్ పాలనలో అమ్మాయిలకు రక్షణ లేదు.. ప్రజాస్వామ్యవాదుల మౌనం మంచిది కాదు: బండి సంజయ్

  • కేసీఆర్ నియంత పాలనలో సామాన్యులు బతికే పరిస్థితి లేదు
  • కళ్ల ముందే విద్యార్థులు రాలిపోతున్నారు
  • ఘోరాలు జరుగుతున్నా ప్రజాస్వామ్యవాదులు మౌనంగానే ఉన్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అమ్మాయిలకు ఏమాత్రం రక్షణ లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా లేదని విమర్శించారు. మెడికో స్టూడెంట్ ప్రీతి మరణవార్త నుంచి కోలుకోకముందే నర్సంపేటలో ఇంజినీరింగ్ చదువుతున్న రక్షిత అనే విద్యార్థిని ర్యాగింగ్ భూతానికి బలి కావడం తీవ్ర ఆవేదనను కలిగిస్తోందని చెప్పారు. 

రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నా ప్రజాస్వామ్యవాదులు మౌనంగానే ఉంటున్నారని, వారి మౌనం రాష్ట్రానికి మంచిదికాదని, ఇప్పటికైనా వారు నోరు విప్పాలని కోరారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు కళ్ల ముందు రాలిపోతున్నా స్పందించకపోవడం మానవత్వానికి కళంకమని చెప్పారు. ఇలాంటి దారుణ ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనలో సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News