జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప టీడీపీ బతకదని వాళ్లకు అర్థమైంది: మంత్రి రోజా

  • మార్చిలో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు
  • తిరుపతిలో సమావేశమైన వైసీపీ మంత్రులు
  • టీడీపీ ఎన్టీఆర్ పార్టీ అన్న రోజా
  • చంద్రబాబుది కాదని వ్యాఖ్యలు
ఏపీలో మరికొన్నిరోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరుపతిలో వైసీపీ మంత్రులు, కీలక నేతలు భేటీ అయ్యారు. ఎయిర్ బైపాస్ రోడ్డులోని పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ సమావేశానికి ఆర్కే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రోజా మాట్లాడారు. 

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ ఇటీవల నారా లోకేశ్ ఆహ్వానించడంపై ఆమె స్పందించారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని స్పష్టం చేశారు. టీడీపీ ఎన్టీఆర్ పార్టీ అని, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప ఆ పార్టీ బతకదని వాళ్లకు అర్థమైనట్టుందని వ్యంగ్యం ప్రదర్శించారు. లోకేశ్ పాదయాత్ర విఫలమైన నేపథ్యంలో, వారాహితో పవన్ కల్యాణ్ ఎక్కడ హీరో అయిపోతాడోనని భయపడుతున్నారని అన్నారు. అందుకే పవన్ కల్యాణ్ పై విషం చిమ్ముతున్నారని రోజా ఆరోపించారు. 

ఈ సందర్భంగా ఆమె లోకేశ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోకేశ్ పాదయాత్రకు జనాలే లేరని, చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఇన్చార్జిలు కూడా లేరని ఎద్దేవా చేశారు. లోకేశ్ తన స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని, పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టుగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. "మా ఇలాకాలోకి వచ్చి మా తాట తీస్తానంటున్నాడు.... లోకేశ్ కు దమ్ముంటే చిత్తూరులో పోటీ చేయాలి" అని రోజా సవాల్ విసిరారు.


More Telugu News