వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టత ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • విజయవాడలో తెలుగు రాష్ట్రాల బ్యాంకర్ల సదస్సు
  • ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మీనారాయణ
  • వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని వెల్లడి
  • ఎంపీగా పోటీ చేస్తానని వివరణ
విజయవాడలో నిర్వహించిన ఏపీ, తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య సదస్సుకు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. 

వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. తన ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఉన్న పార్టీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలిపారు. తన ఆశయాలకు ఏ పార్టీ అనుకూలంగా లేకపోతే, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. 

ఇతర అంశాలపైనా లక్ష్మీనారాయణ స్పందించారు. రైతుల ఆత్మహత్యలపై బ్యాంకర్లు ఆలోచించాలని సూచించారు. రైతులకు, కౌలు రైతులకు వేర్వేరుగా రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు సహకరించాలని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచే సత్తా బ్యాంకర్లకే ఉందని స్పష్టం చేశారు. 

ఇక, ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, రైల్వే జోన్ అంశాలపై కూడా లక్ష్మీనారాయణ తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం సహా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని తెలిపారు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలని అన్నారు.


More Telugu News