రోజుకు 14 గంటలు స్మార్ట్ ఫోన్ వాడిన యువతి ఎంతటి దుస్థితిలో పడిందంటే..

  • స్మార్ట్‌ఫోన్‌ను అతిగా వాడటంతో యువతికి అనూహ్య సమస్య
  • శరీరం సమతౌల్యం కోల్పోయి చక్రాల కుర్చీకే పరిమితం
  • స్మార్ట్‌ఫోన్ వ్యసనం నుంచి బయటపడ్డాక కోలుకున్న యువతి
స్మార్ట్‌ఫోన్‌ వ్యసనంగా మారిపోయిన అనేక మంది ఊహించని చిక్కుల్లో పడుతున్నారు. రోజుకు 14 గంటల పాటు స్మార్ట్‌ఫోన్ వాడిన బ్రిటన్ యువతి ఫెనెల్లా కొన్ని నెలల పాటు చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సిన దుస్థితిలో పడింది. ఇటీవల కోలుకున్న ఆమె తన అనుభవాల గురించి మీడియాకు తెలిపింది.

ఫెనెల్లా 2021లో పోర్చుగల్‌లో ఉండగా స్మార్ట్ వినియోగం తాలూకు ప్రతికూల ఫలితాలు కనిపించడం ప్రారంభించాయి. అప్పట్లో ఆమె రోజులో 14 గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌కు కళ్లప్పగించేది. దీంతో..క్రమంగా ఆమె శరీరం సమతౌల్యం కోల్పోయింది. తిన్నగా రెండు అడుగులు వేయలేని పరిస్థితికి చేరుకుంది. తల, మెడ నొప్పితో సతమతమయ్యేది. లేచి నిలబడిన ప్రతిసారీ కళ్లు తిరగడంతో తన పనులు తాను చేసుకోలేని దుస్థితికి చేరుకుంది. దీంతో..ఆమె పోర్చుగల్ వీడి బ్రిటన్‌లో తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఆ తరువాత కొన్ని నెలల పాటు ఆమె చక్రాల కుర్చీకే పరిమితమైంది. 

ఫెనెల్లా సమస్య తొలుత వైద్యులకు కూడా అర్థం కాలేదు. వైద్యుల చికిత్సతో పరిస్థితి కొంత మెరుగుపడగా చూస్తుండగానే మళ్లీ మునపటి స్థితికి చేరుకునేది. సమస్యను అన్ని కోణాల్లో పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫెనెల్లా డిజిటల్ వర్టిగో అనే రుగ్మతతో బాధపడుతున్నట్టు తేలింది. ఈ సమస్య ఉన్న వారిలో మెదడుకు రక్తం, ఆక్సిజన్ సరఫరా చేసే వ్యవస్థలో ఇబ్బంది తలెత్తుతుంది. ఫలితంగా బాధితులు నడకలో సమతౌల్యం కోల్పోవడం, తలనొప్పి, మైకం వంటి సమస్యలతో మంచానికే పరిమితమవుతున్నారు. అసలు విషయం తెలిసాక ఆమె స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా పక్కన పెట్టేసింది. ఆ తరువాత ఆమె ఆరోగ్యం క్రమంగా చక్కబడింది. 



More Telugu News