హోటల్ రూమ్ బుక్ చేసుకుంటే.. రష్యా టూరిస్ట్ వీసా వచ్చేసినట్టే !

  • పర్యాటకులను ఆకట్టుకునేందుకు రష్యా ఆఫర్
  • ఆరు నెలల టూరిస్టు వీసా ఇస్తామని ప్రకటన
  • కొత్త వీసా విధానంలో భాగంగా భారత టూరిస్టులకు వెసులుబాటు
  • మరో 18 దేశాల పౌరులకూ వర్తింస్తుందని వెల్లడి
పర్యాటకులను ఆకట్టుకోవడానికి, వీసా టెన్షన్ దూరం చేయడానికి రష్యా ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ సహా మొత్తం 19 దేశాలకు చెందిన పర్యాటకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ దేశంలోని హోటళ్లలో రూమ్ లు బుక్ చేసుకుంటే వీసా జారీ చేసే విషయంలో కొంత ఉదారత చూపనున్నట్లు వెల్లడించింది.

ఈ కొత్త విధానం ప్రకారం.. రష్యా హోటళ్లలో రూమ్ బుక్ చేసుకున్నోళ్లకు దాదాపుగా టూరిస్టు వీసా వచ్చేసినట్లేనని నిపుణులు చెబుతున్నారు. పర్యాటకరంగానికి మరింత ఊతమిచ్చేందుకు రష్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అభిప్రాయపడుతున్నారు.

భారత్‌తో పాటు బహ్రెయిన్, బ్రూనై, కంబోడియా, చైనా, ఇండోనేషియా, ఇరాన్, డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, కువైట్, లావోస్, మలేషియా, మెక్సికో, మయన్మార్, ఒమన్, సౌదీ అరేబియా, సెర్బియా, థాయిలాండ్, టర్కీ, ఫిలిప్పీన్స్ దేశాలకు ఈ కొత్త వీసా విధానం వర్తిస్తుంది. ఆయా దేశాల పర్యాటకులు రష్యాలోని హోటల్స్ లో రిజర్వేషన్ చేసుకుంటే 6 నెలల వరకు టూరిస్ట్ వీసాను ఈజీగా పొందే వీలుంది.

ఇటీవలే 11 దేశాలకు వీసా రహిత ప్రయాణాన్ని అందించనున్నట్లు రష్యా ప్రకటించింది. దీంతో పాటు పర్యాటక వీసాల జారీ ప్రక్రియను మరింత సరళం చేయాలని నిర్ణయించింది. వారం రోజుల వ్యవధిలోనే ఈ కొత్త వీసా విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. మరో 70 దేశాలకు ఎలక్ట్రానిక్ వీసాలను ప్రవేశపెట్టాలని పుతిన్ సర్కారు భావిస్తున్నట్లు, త్వరలోనే ఈ వీసాలు అమలులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.


More Telugu News