మోదీ పాక్‌ను ఆదుకోవచ్చు: రా మాజీ చీఫ్

  • ఆర్థికకష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పాక్
  • మోదీ ఆపన్న హస్తం అందించొచ్చన్న రా మాజీ చీఫ్
  • పొరుగు దేశాలతో నిరంతరం దౌత్య సంబంధాలు కొనసాగించాలని సూచన
పీకల్లోతు ఆర్థికకష్టాల్లో కూరుకుపోయిన దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆపన్న హస్తం అందిస్తారని తాను భావిస్తున్నట్టు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) మాజీ చీఫ్ అమర్జిత్ సింగ్ దులాత్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివర్లో మోదీ పాక్‌ను ఆదుకోవచ్చని తనకు అనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ‘‘ఈ ఏడాదిలోనే మోదీగారు పాకిస్థాన్‌ను ఆదుకోవచ్చని నాకు అనిపిస్తోంది. ఇదేమీ సీక్రెట్ కాదు..కేవలం మనసుకు అలా అనిపిస్తోంది’’ అని ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. 

అయితే.. ఇరాన్, రష్యా, చైనాల మధ్య బంధం బలపడుతోందని కూడా ఆయన భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారత్‌కు అమెరికా మిత్రదేశమైనప్పటికీ అమెరికా సుదూరాన ఉందని, ఇరుగుపొరుగు మాత్రం ఎప్పుడూ సమీపంలోనే ఉంటారని వ్యాఖ్యానించారు.  పాక్‌కు స్నేహం హస్తం చాచేందుకు ఏ సందర్భమైనా అనువైనదేనని అమర్జిత్ సింగ్ పేర్కొన్నారు. పొరుగు దేశాలతో సంబంధాలను నిరంతరం కొనసాగించాలని సూచించారు. 

ప్రస్తుతం పాకిస్థాన్ కష్టాలకొలిమిలో పడి కొట్టుమిట్టాడుతోంది. ఓవైపు అడుగంటుతున్న విదేశీ మారక ద్రవ్యం, దేశవ్యాప్తంగా కరెంట్ కోతలు, రాజకీయ అస్థిరత, నానాటికీ దిగజారుతున్న పాకిస్థాన్ కరెన్సీ విలువ కలగలిపి పాక్‌ను అంతర్జాతీయ సమాజం ముందు చేయిచాచేలా చేశాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సాయం కోసం పాక్ ఇప్పటికే పలు కఠిన నిబంధనలకు అంగీకరించింది. 

అయితే.. పాకిస్థాన్‌ గతంలోనూ ఇలాంటి సంక్షోభం ఎదుర్కొందని పరిశీలకులు చెబుతున్నారు. అప్పట్లో తనకున్న భౌగోళిక రాజకీయ ప్రాధాన్యాన్ని అడ్డుపెట్టుకుని పాక్.. ప్రపంచం సాయాన్ని సాధించుకుంది. అయితే..ఈ వ్యూహం ప్రస్తుతం ఫలించట్లేదని పరిశీలకులు చెబుతున్నారు. దీంతో.. భారత్‌తో చర్చలకు పాక్ ఈసారి మరింత సుముఖంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.


More Telugu News