18 ఏళ్ల వయసుదాకా నిరక్షరాస్యుడు.. ఇప్పుడేమో కేంబ్రిడ్జి వర్సిటీ ప్రొఫెసర్

  • చిన్నతనంలో అనారోగ్యంతో విద్యకు దూరమైన యువకుడు
  • అడ్డంకులన్నీ అధిగమించి 18 ఏళ్ల వయసులో ఓనమాలు దిద్దాడు
  • పట్టుదలతో చదివి ప్రఖ్యాత యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉద్యోగం
పుట్టుకతో వచ్చిన అనారోగ్యంతో ఓ బాలుడు పదకొండేళ్ల వయసు వచ్చేదాకా మాట్లాడలేకపోయాడు.. పద్దెనిమిదేళ్ల వయసు దాకా స్కూలు ముఖమే చూడలేదు.. ఆ యువకుడి జీవితాంతం అలాగే ఉండిపోతాడని వైద్యులు తేల్చేశారు. అయితే, వైద్యుల మాటలను తప్పని నిరూపించాలని భావించాడా యువకుడు.. ఏదో ఒకరోజు ఆక్స్ ఫర్డ్ లేదా కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఉద్యోగం సాధిస్తానని తన తల్లి బెడ్ రూం గోడలపై రాసుకున్నాడు.

పట్టుదలగా చదివి, ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో అనుకున్నది సాధించాడు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా అడుగుపెట్టబోతున్నాడు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ చరిత్రలో అతి తక్కువ వయసులో ప్రొఫెసర్ గా ఎంపికైన తొలి నల్లజాతీయుడిగా రికార్డు సృష్టించాడు. యూకేకు చెందిన ఆ యువకుడి పేరు జేసన్ ఆర్డే.

తన బాల్యమంతా చాలా సవాళ్లతో కూడుకున్నదని ఆర్డే చెప్పారు. అనారోగ్యం వల్ల తాను పదకొండేళ్ల వరకు మాట్లాడలేకపోయానని వివరించారు. తన విషయంలో డాక్టర్లు, థెరపిస్టులు పెదవి విరిచారని, జీవితంలో తానేమీ సాధించలేనని తేల్చేశారని తెలిపారు. అయితే, వాళ్ల మాటలు తనలో పట్టుదలను పెంచాయని, జీవితంలో ఏదైనా సాధించాలనే తపన పెరిగిందని పేర్కొన్నారు. తన తల్లి బెడ్ రూంలో తను కన్న కలలను గోడలపై రాసుకున్నానని చెప్పుకొచ్చారు.

ఆ కలలను నెరవేర్చుకోవడానికి ఎంతో శ్రమించినట్లు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్డే తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టువీడకుండా ప్రయత్నించి పీఈ టీచర్ అర్హత సాధించానని, లివర్ పూల్ జాన్ మూర్స్ యూనివర్సిటీ నుంచి పీహెచ్ డీ పట్టా అందుకున్నానని చెప్పారు. అకడమిక్ రంగంలో స్థిరపడాలన్న తన లక్ష్యాన్ని సాధించడంలో తన స్నేహితుడు, మెంటార్ ల ప్రోత్సాహం ఎంతో ఉందని ఆర్డే తెలిపారు.

వారి ప్రోత్సాహంతోనే గ్లాస్గో యూనివర్సిటీలో ఉద్యోగం సాధించానని, అత్యంత పిన్న వయస్కుడైన ప్రొఫెసర్ గా రికార్డు నెలకొల్పానని వివరించారు. ఈ సందర్భంగా సమాజంలో వెనకబడిన తరగతుల వారు, ఉన్నత విద్యను అందుబాటులోకి తేవడమెలా అనే విషయంపై తాను పరిశోధన చేసినట్లు ఆర్డే వివరించారు. కాగా, తొందర్లోనే కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చేరనున్నట్లు ఆర్డే చెప్పుకొచ్చారు.


More Telugu News